Sunday, January 19, 2025

పంట సాగుచేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలి

- Advertisement -
- Advertisement -

రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముచ్చటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ధాన్యం, పత్తికొనుగోలు సెంటర్లలో కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి తుమ్మల
పంట అవశేషాలు కాల్చడం వల్ల జరిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : పంట సాగుచేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వరి, పత్తి కొనుగోలు విషయంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నాగర్ కర్నూల్ రైతులతో కూడా పత్తి కొనుగోలు అంశాలపై మాట్లాడారు. మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ‘వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు‘ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వర రావు సెక్రటేరియట్ నుంచి పాల్గొని రైతులతో ముచ్చటించారు.

పత్తి , వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలోని రైతులతో మంత్రి ముచ్చటించి అక్కడి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో ఈ ఏడాది మార్చి 6న 110 రైతు వేదికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున దృశ్య శ్రావణ పరికరాలు ఏర్పాటు చేసి రైతులతో నేరుగా మాట్లాడే రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయంతెలిసిందే. రైతు నేస్తం కార్యక్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ, అనుబంధ శాఖ కార్యకలాపాలపై రైతు సమాజానికి అవగాహన కల్పించడానికి ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటివరకు 33 ఎపిసోడ్లను నిర్వహించి రైతులకు విజయవంతంగా శిక్షణ అందించారు.

మంగళవారం కార్యక్రమంలో ‘వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు‘ పై వ్యవసాయ శాస్త్రవేత్త టి. ప్రభాకర్ రెడ్డి కెవికె పాలెం నుండి దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అభ్యుదయ రైతు చంద్రయ్య, దేవేందర్ రెడ్డి వారి అనుభవాలను పేర్కొంటూ వరి కొయ్యలు కాల్చవద్దని, తద్వారా కలిగే లాభాలను తమ అభిప్రాయాలను తోటి రైతులతో పంచుకున్నారు. కామారెడ్డి, జనగాం, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాలోని రైతులతో వరి కొనుగోలు కేంద్రాల నుండి ముఖాముఖి మాట్లాడి, వరి ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాలలో రైతులకు సంబందించిన సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వరి సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ గురించి, సన్న ధాన్యం పండించి, ఇప్పటికి కొనుగోలు కేంద్రాల్లో అమ్మి, బోనస్ డబ్బులు జమ అయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ వరి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు బాగున్నాయని, ముఖ్యంగా సన్న ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజుల్లోనే బోనస్ డబ్బులు రూ.500 ప్రతి క్వింటాలుకు జమ అవుతున్నాయని, రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధమైన చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

వరి, మొక్కజొన్న, పత్తి పంటలు, కోసిన తర్వాత, వాటి అవశేషాలను రైతులు కాల్చి వేయడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుతుందని, ఇలా చేయడం వల్ల భూమి కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని, పంట అవశేషాలను రైతులు కాల్చకుండా, భూమిలో కుళ్ళి పోయేలా చేసుకోవాలని, ఈ విషయమై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ వింగ్, వ్యవసాయ విశ్వ విద్యాలయం రాజేంద్రనగర్ నుండి హాజరై రైతులకు అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్, వ్యవసాయ అదనపు సందాలకులు విజయ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News