Saturday, March 22, 2025

జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
యశ్వంత్‌వర్మ ఇంట్లో దొరికిన
నగదు అగ్నిప్రమాద సమయంలో
బయటపడిన కరెన్సీ కట్టలు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
సీరియస్ కొలీజియంలో
విస్తృత చర్చ అలహాబాద్
హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
న్యాయమూర్తి బదిలీపై అలహాబాద్ బార్ అసోసియేషన్ అభ్యంతరం
వర్మ బదిలీకి, నోట్ల కట్టలకు
సంబంధం లేదని సుప్రీం వివరణ

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం సమయంలో వెలుగు చూసినట్లుగా పేర్కొంటున్న భారీ నోట్ల కట్టల ఘటనపై సుప్రీం కోర్టు కొలీజియం శుక్రవారం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. అలహాబాద్ హైకోర్టుకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బదలీకి ఆయన అధికార నివాసంలో భారీ ఎత్తున నగదు స్వాధీనం ఉదంతంతో సంబంధం లేదని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. నిర్దేశిత నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు, బదలీ నిర్ణయాన్ని ప్రస్తుత దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తీసుకున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. ‘జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని, వదంతులను వ్యాప్తి చేస్తున్నారు’ అని సుప్రీం కోర్టు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. నగదు దొరకడానికి ఆయన బదలీతో ముడిపెడుతున్న ఊహాగానాలను కోర్టు ఖండించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, ఆధారాలను సేకరించి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే అంతర్గత దర్యాప్తు ప్రారంభించారని కూడా సుప్రీం కోర్టు తెలియజేసింది. ఆ దర్యాప్తు నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి అందజేయనున్నారు. సిజెఐ, అత్యంత సీనియర్ న్యాయమూర్తులు నలుగురితో కూడిన సుప్రీం కోర్టు కొలీజియం జస్టిస్ వర్మ బదలీకి సిఫార్సు చేసింది. తరువాత సుప్రీం కోర్టు కన్సల్టీ జడ్జీలు, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, జస్టిస్ వర్మకు లేఖలు పంపారు. వారి స్పందనలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అటుపిమ్మట కొలీజియం ఈ అంశంపై తీర్మానం ఆమోదిస్తుంది. ఢిల్లీ హైకోర్టు వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, జస్టిస్ వర్మ 1992 ఆగస్టు 8న న్యాయవాదిగా నమోదు అయ్యారు. ఆయన 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియుక్తుడయ్యారు.

ఆయన 2016 ఫిబ్రవరి 1న అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చే శారు. ఆయన ఆ తరువాత 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియుక్తుడయ్యారు. ఆయన ప్ర స్తుతం అమ్మకం పన్ను, జిఎస్‌టి, కంపెనీ అప్పీళ్లు, ఇతర అప్పీళ్ల కేసులను పరిశీలిస్తున్న డివిజన్ బెంచ్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఢిల్లీ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ వర్మ శుక్రవారం కోర్టులో బాధ్యతలు నిర్వర్తించలేదు. ఆ విషయాన్ని హైకోర్టు మాస్టర్ న్యాయవాదులకు తెలియజేశారు. కాగా, సీనియర్ న్యాయవాది ఒకరు బెంచ్ ముందు ఈ అంశం ప్రస్తావించినప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ బాధ, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జస్టిస్ వర్మ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం దరిమిలా భారీగా నగదు కట్టలు బహిర్గతం కావడం గురించి ప్రభుత్వ అధికారులు కొందరు సమాచారం అందజేసిన తరువాత సర్వోన్నత న్యాయస్థానం కార్యోన్ముఖం అయినట్లు తెలుస్తోంది. జస్టిస్ వర్మను బదలీ చేయడమే కాకుండా ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని కొలీజియంలోని సీనియర్ సభ్యులు కొందరు కోరినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను కోరాలని, అందుకు నిరాకరిస్తే సర్వోన్నత న్యాయస్థానం తీర్పుల్లో సూచించినట్లుగా అంతర్గత దర్యాప్తు ప్రారంభించాలని వారు కోరినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News