మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం
ముంబయి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా కరోనా రహిత గ్రామ పోటీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బుధవారం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని గ్రామాలు చేస్తున్న కృషిని ఇటీవల అభినందించిన ముఖ్యమంత్రి థాక్రే నా గ్రామం కరోనా రహితం పేరిట ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గట్టిగా కృషిచేస్తున్న మూడు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నగదు బహుమతులు అందచేస్తుందని రాష్ట్ర గ్రామీనాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రీఫ్ తెలిపారు. మొదటి బహుమతి కింద రూ. 50 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ. 25 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ. 15 లక్షలు అందచేస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం ఆరు రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. దీని వల్ల మొత్తం 18 బహుమతులు అందచేయడం జరుగుతుంది. మొత్తం నగదు బహుమతి విలువ రూ. 5.4 కోట్లని ఆయన చెప్పారు. ఈ పోటీలో గెలుపొందిన గ్రామాలకు నగదు బహుమతికి సమానంగా ప్రోత్సాహకం కింద అదనంగా నగదును అందచేయడం జరుగుతుందని, దీన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే గ్రామాలను 22 అంశాల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, గ్రామాలను ఎంపిక చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.