న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని ఘజీరాబాద్‌లో మంగళవారం సాయంత్రం ఎటిఎం మెషిన్‌లో నగదును భర్తీ చేసేదుకు వచ్చిన క్యాష్ వ్యాన్ గార్డును హత్య చేసి ఒక వ్యక్తి రూ. 78 లక్షల నగదుతో పరారయ్యాడు. క్యాష్ వ్యాన్ వద్ద కాల్పులు జరిగినట్లు తమకు సాయంత్రం 5 గంటలకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. జగత్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఎటిఎంలో నగదును నింపడానికి ఒక క్యాష్ వ్యాన్ చేరుకుంది.
గార్డుతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు నగదును కిందకు దించుతుండగా వెనుక నుంచి వచ్చిన ఒక వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు. నగదు తీసుకుని ఆ వ్యక్తి పరారయ్యాడు. కాల్పుల్లో గాయపడిన ఉదయ్‌పాల్ సింగ్(55) అనే గార్డును ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, వివాహం కావలసిన నలుగురు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.