డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు
మన స్త్రీ నిధి యాప్‌తో పారదర్శకంగా చెల్లింపులు
పోస్టాఫీస్‌ల్లో సంఘాల లావాదేవీలకు రూపకల్పన
ఈ నెల 31న స్త్రీనిధి సహకార పరపతి సమాఖ్య సర్వసభ్య సమావేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు స్త్రీనిధి యాప్‌ను తెచ్చారు. ఈ యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహించుకునేందుకు వీలుగా డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాంను రూపకల్పనకు స్త్రీ నిధి సహకార పరపతి సమాఖ్య కసరత్తు చేస్తోంది. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు చెల్లించే మొత్తాలు పక్కదారి పడుతున్నట్లు.. దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుడడంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా స్త్రీ నిధి యాప్‌లో సభ్యుల ఆర్థిక లావాదేవీలు పొందపరుస్తున్నారు. ఈ యాప్‌పై గ్రామీణ సంఘాల మహిళలకు మరింత అవగాహన కల్పించేందుకు గ్రామ, మండల, జిల్లా స్త్రీ నిధి సమాఖ్యల ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించేందుకు సమాఖ్య రాష్ట్ర ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో గ్రామ సమాఖ్య ప్రతినిధులు సంఘాల సభ్యుల నుంచి తీసుకున్న నగదు మొత్తం ఏ తేదీల్లో జమ చేశారు.. సభ్యుల ఆర్థిక వివరాలను తెలుసుకునేలా ఇప్పటికే యాప్ వివరాలను పొందపర్చారు. వీటిని మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.
స్త్రీ నిధి రుణాలతో వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళలు…
స్వయం సహాయక సంఘాల్లోని గ్రామీణ మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కింద వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు రెండేళ్లలో 1.70 లక్షలకు పైగా మోడల్ ఎంటర్‌ప్రైన్యూర్లను ప్రమోట్ చేసినట్లు స్త్రీనిధి సమాఖ్య ప్రతినిధులు చెబుతున్నారు. మరో వైపు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద స్టార్టప్ ప్రమోషన్, ఎంటర్‌ప్రెజ్ ఫైనాన్సింగ్, ధాన్యం సేకరణ, తదితరాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాయి. కమీషన్ల రూపంలో రూ.64 కోట్ల మేర ఆదాయం పొందాయి.
స్త్రీనిధి రుణ విధానంలో మార్పులకు శ్రీకారం ..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండలాల్లో స్త్రీనిధి రుణ వాయిదాల వసూళ్లలో జరిగిన అవకతవకలపై సమీక్షించిన అధికారులు రుణ విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. రుణం విడుదలకు సంబంధించి అప్పు తీసుకోబోయే మహిళల వివరాలను గ్రామ సమాఖ్య సంఘం సహా క్లస్టర్ ప్రతినిధులకు వివరించి వారి సమక్షంలోనే రుణం విడుదల చేసి వాయిదాల వసూళ్లకు ఉమ్మడి బాధ్యులను చేసే ఆలోచనకు ప్రతిపాదించనున్నారు. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణపై నియంత్రణను కేవలం ప్రాంతీయ మేనేజర్‌కు మాత్రమే పరిమితం చేసి జవాబుదారీగా చేయనున్నారు. ప్రతి నెలా రుణం తీసుకున్న సభ్యురాలికి తీసుకున్న అప్పు, చెల్లించిన వాయిదాలు, మిగిలిన బకాయి వివరాలను అందించే ఏర్పాట్లు చేయనున్నారు.
త్వరలోనే పోస్టాఫీస్ శాఖల ద్వారా సంఘాల లావాదేవీలు..
రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టాఫీస్ శాఖల్లో స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలు జరిపేలా స్త్రీ నిధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్టాఫీస్‌ను బ్యాంకులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపట్టడంతో.. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే స్త్రీనిధి సంస్థ ఆర్థిక లావాదేవీలు జరిపేలా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 6 వేలకు పైగా పోస్టల్ శాఖలు విస్తరించి ఉండడంతో.. గ్రామీణ ప్రాంతాల సంఘాలకు ఈ ఆర్థిక కార్యకలాపాలను మరింత పారదర్శకంగా జరిపే వీలు కలగనున్నదని స్త్రీనిధి సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు.
31న స్త్రీ నిధి సమాఖ్య సర్వసభ్య సమావేశం..
స్త్రీ నిధి సహకార పరపతి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 31న అన్ని మండల, జిల్లా సమాఖ్యలతో కలిసి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వార్షిక సంవత్సరంలో చేపట్టిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి సంస్థ చేపట్టే కార్యక్రమాలు, రుణాల లక్ష్యాలను నిర్దేశించుకోనున్నారు. వార్షిక సంవత్సర ఆర్థిక నివేదికను విడుదల చేయనున్నారు. 2021-22 సంవత్సరం రూ.115 కోట్ల మేర ఆదాయాన్ని పొందిన స్త్రీ నిధి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరం ఏ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుందో.. మరో రెండు రోజుల్లో వెల్లడించనున్నారు.