Thursday, January 23, 2025

జల గణన

- Advertisement -
- Advertisement -

దేశంలో 24,24,540 నీటి వసతులున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ గత వారంలో విడుదల చేసిన జల వనరుల గణన నివేదిక ప్రాణావసరమైన నీటి లభ్యతలో మనం ఎక్కడ వున్నామో తెలియజేస్తున్నది. ప్రపంచ జనాభాలో 18% మంది వున్న భారత దేశంలో విశ్వవ్యాప్తంగా గల నీటిలో కేవలం 4% మాత్రమే వుంది. నీటి అవసరానికి అందుబాటుకి గల వ్యత్యాసం ఎంత ఆందోళనకరంగా వుందో దీనిని బట్టి వెల్లడవుతున్నది. చెరువులు, రిజర్వాయర్లు, సరస్సులు, సహజ నీటి వసతులు, మానవ నిర్మిత వనరులు ఇలా పలు రకాల జల ఖజానాలను గురించి జలశక్తి శాఖ నివేదిక సవివరమైన సమాచారం అందించింది. ఎక్కడెక్కడ ఏ విధంగా నీరు అందుబాటులో వుందో తెలియజేసింది.

మొత్తం నీటి వసతులలో 97.1% గ్రామీణ ప్రాంతాలలో వున్నట్టు, కేవలం 2.9% వసతులు మాత్రమే పట్టణ ప్రాంతాలలో నెలకొన్నట్టు తెలియజేసింది. మొత్తం వనరులలో 55.2% ప్రైవేటు యాజమాన్యంలో మిగతావి మాత్రమే ప్రభుత్వం వద్ద వున్నట్టు వెల్లడించింది. 1.6 % జల వనరులు ఆక్రమణకు గురైనట్టు చెప్పింది. భారత దేశంలో తొలకరి వానలు ఆశ చూపి నిరాశపరుస్తుంటాయని అందుచేత నీటి కోసం దేశ ప్రజలు రానురాను మరింతగా ఇక్కట్లు పడతారని నీతిఆయోగ్ ఒక నివేదికలో పేర్కొన్నది. 60 కోట్ల మంది భారతీయులు సరైన నీటి సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి 21 నగరాల్లో భూగర్భ జల వనరులు అడుగంటిపోతున్నాయని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 80 నుంచి 90 శాతం మంచి నీటి అవసరాలకు భూగర్భ జల వనరుల మీదనే ఆధారపడుతున్నాయని తెలియజేసింది. ఇది ముమ్మాటికీ వాస్తవం. దేశంలో నమ్మదగిన నీటి పారుదల సౌకర్యాలు బహు తక్కువగా వున్నాయి. నదులు అనేకం వున్నా వాటి నీటి మీద ఆధారపడగలిగే స్థితి లేదు. అందుచేత వ్యవసాయానికి ఎక్కువగా భూగర్భ నీటినే వినియోగిస్తున్నారు. దేశంలో పడే వర్షపు నీటిలో 65% సముద్రంలో కలిసిపోతున్నది. 70% వ్యవసాయం వర్షాధారమే. సంపన్న వర్గాలకు అందుబాటులో వున్నంత నీరు పేద వర్గాలకు లభించడం లేదు. వేసవిలో ట్యాంకర్ల వద్ద ఎగబాకే జనం నిరుపేదలే. వారు నీరు పేదలు కూడా. 24 లక్షల పైచిలుకు నీటి వసతుల్లో 20 లక్షల 30 వేల వరకు అంటే 83.7 శాతం వనరులు ఉపయోగంలో వుండగా, మిగతా 4 లక్షలు అంటే 16.3 % వనరులే నిరుపయోగంగా వున్నట్టు తేలింది.

చెరువులు, బావులు వంటి చాలా జల వనరుల్లో పూడిక తీయకపోడం వల్ల వర్షపు నీరు వృథాగా తరలిపోతున్నది. పట్టణాలు, నగరాల్లో గృహ నిర్మాణం మితిమించిపోయి అక్కడి ఒకప్పటి చెరువులు, దొరువులు అదృశ్యమైపోతున్నాయి. దేశ జనాభాలో 36% నగరాల్లోనే నివసిస్తున్నారు. కాని అక్కడి 70% నీరు కలుషితమైపోతున్నది అని కేంద్ర కాలుష్య నివారణ బోర్డు తెలియజేసింది. ఈశాన్యంలోని అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లో, ఉత్తర భారత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో 50% జల వసతులను చేపల పెంపకానికి వినియోగిస్తుండగా, గుజరాత్, తెలంగాణ, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో 50% వనరులను వ్యవసాయానికి, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో 50% వసతులను మంచి నీటికి వినియోగిస్తున్నారని జల శక్తి శాఖ జల వసతుల గణన నివేదిక వెల్లడించింది.

మొత్తం వసతులలో 78% మనిషి సృష్టించుకున్నవే కావడం గమనార్హం. వర్షాభావ ప్రాంతాలలో నీటిని నిల్వ వుంచుకోడానికి చెక్‌డ్యామ్స్ నిర్మాణం ఇటీవల కాలంలో పెరిగింది. వాటిని కాపాడుకోడంలోనే మనిషి విజ్ఞత ఇమిడి వుంటుంది. ఎన్ని జల వసతులున్నా వాటికి నీరు అందించేది వర్షమే. వానలు సకాలంలో పడకపోడంతో పంటలు దెబ్బతిని ఒకవైపు ఆహార సంక్షోభం, మరోవైపు మంచి నీటి కరవు ఏర్పడుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే తొలకరి వానలు సకాలంలో వస్తాయని ఆశించి రైతులు విత్తనాలు కూడా చల్లుకొని అదే పనిగా ఆకాశం వంక చూడడం, భంగపడడం మనకు మామూలే. మండు వేసవిలో అకాల వర్షాలు కురిసి వరి, మామిడి వంటి పంటలను నష్టపరచడం రైతులు తడిసిన పంటను చూసి కన్నీళ్ళ పర్యంతం కావడం తరచూ చూస్తున్నాము.

అలాగే వర్షాలు కురవాల్సిన సమయంలో అవి ముఖం చాటేసి పంటలు మాడిపోయే స్థితికి కారణమవుతున్నాయి. అప్పో, సప్పో చేసి, వున్నది, లేనిది తాకట్టు పెట్టి పంటలు వేసుకొన్న రైతు కంట తడి హృదయాలను కలచివేస్తుంటుంది. ప్రకృతి కరుణిస్తేనే మనిషికి సుఖం, లేకపోతే దుఃఖమే. అందుచేత నీటిని పొదుపు చేసుకోడం, పొదుపుగా వాడుకోడం, అదనపు నీటి నిల్వ సౌకర్యాలను పెంచుకోడం అత్యంత అవసరం. వర్షాలు బాగా పడినప్పుడు నదులు నింmanaడి వరదలు కూడా సంభవించి నీరు వృథాగా సముద్రంలోకి కలిసిపోతుంది. వీలైనన్ని రిజర్వాయర్లను నిర్మించుకొని ఆ నీటిని కాపాడుకోగలిగితే అన్ని అవసరాలకీ ఉపయోగపడుతుంది. ముందు చూపుతోనే ముంచుకు వచ్చే విపత్తులను ఎదుర్కోగలుగుతాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News