కులాల వారి గణన కీలకం: లాలూ
పాట్నా/న్యూఢిల్లీ : దేశంలో కులాలవారిగా జనగణన జరగాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం దేశ జనాభాలో ఏ వర్గం ఏ సంఖ్యలో ఉందనేది తెలుసుకోవడం ద్వారా రిజర్వేషన్ల కోటా సముచితరీతిలో ఖరారు చేసుకునేందుకు వీలేర్పడుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల సంఖ్య దేశపు మొత్తం జనాభాతో లెక్కచూసుకుంటే సగానికి మించి ఉంటే ఇప్పటి 50 శాతం కోటా నిర్ణీత పరిమితిని మార్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కులాల వారి సంఖ్య ప్రాతిపదికన రిజర్వేషన్ల దక్కాల్సి ఉందని, ఇది అత్యవసరం అని లాలూ ప్రసాద్ తేల్చిచెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో జైలు నుంచి విడుదల అయిన లాలూ ఢిల్లీలోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. బీహార్‌లోని తమ పార్టీ కార్యకర్త కోసం ఏర్పాటు అయిన శిక్షణా శిబిరం సందర్భంగా ఆయన ఆన్‌లైన్‌ద్వారా వారిని ఉద్ధేశించి మాట్లాడారు.
అవసరాన్ని బట్టి కోటా లక్ష్మణరేఖను ఛేదించాల్సి ఉంటుందని ఈ సీనియర్ నేత తెలిపారు. దేశంలో కులాల వారిగా జనగణన జరగాల్సి ఉందని తొలుత ప్రస్తావించింది తానే అని, ఈ విషయంపై పార్లమెంట్‌లోనూ డిమాండ్ చేశానని రాజకీయ దిగ్గజంగా పేరొంది, కేంద్ర మంత్రిగా కూడా ఉండి, పశువుల దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించిన లాలూ దేశంలో ఇప్పటి కోటా చర్చనీయాంశంపై మాట్లాడారు. తాను అందరి సంక్షేమం కోసం మాట్లాడుతున్నానని, కులాల వారి లెక్కలతోనే న్యాయం జరుగుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన సెన్సస్ ప్రాతిపదికన కోటాలను ఖరారు చేయడం జరిగిందని, జనాభా పెరిగిన దశలో వివిధ సామాజిక వర్గాల సంఖ్య ఏ మేరకు ఉందనేది ఇప్పుడు తెలుసుకోవల్సి ఉంది. ఇది అనివార్యం అత్యవసరం అని లాలూ చెప్పారు.
ఇప్పటి కోటాలు సరిపోవు ..మార్చాలి
దేశంలో ఇప్పుడున్న రిజర్వేషన్ల కోటాకు గతకాలపు ప్రాతిపదిక ఉండటం వల్ల న్యాయం దక్కడం లేదు. ఈ కోటా సరిపోదు. పైగా ఈ కోటాల అమలు కూడా సరిగ్గా జరగదని, దీనితో భారీ స్థాయిలో వర్గాల వారిగా అన్యాయం జరుగుతూ ఉంటుందని లాలూ తెలిపారు. ఇప్పుడు అత్యవసరంగానే కులపరమైన గణన జరగాల్సి ఉందన్నారు. కోటా పరిమితి 50 శాతం దాటితే దాటాల్సిందేనన్నారు.