బిసి హక్కుల సాధన సమితి డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బిసి హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు డిమాండ్ చేశారు. ప్రతి కులానికి న్యాయం చేయాలంటే వారి జనాభా గణాoకాలు సేకరించాల్సిన అవసరం ఉందని, సుపరిపాలన అందించాలంటే ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. జన గణన డేటా ఆధారంగా పాలన రూపొందిస్తే వెనుకబడిన కులాలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయవచ్చన్నారు. దేశవ్యాప్తంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనారిటీ వర్గాల జనాభా 80 శాతానికి పైగా ఉన్నారని, అందువల్ల కుల గణన ఎంతో అవసరమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు కులగణన పట్ల తమ వైఖరి వెల్లడించాలని, తరచుగా రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలు కేంద్ర మంత్రులు వెకిలి మాటలు మాట్లాడి కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న సందర్భంలో కులగణన చేయాలని పార్లమెంట్లో డిమాండ్ చేసిన బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు కుల గణన చేయడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు ప్రజల హక్కులను పరిరక్షించడం, వారికి ప్రాముఖ్యత ఇవ్వడం కులగణన తోనే సాధ్యమని, జన గణన చేయకపోవడంపై పై ఒక పార్లమెంటరీ కమిటీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.