మన తెలంగాణ / హైదరాబాద్ : గతంలో కులగణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన దరిమిలా బిసి కమిషన్ పలు ప్రాంతాల్లో కులగణనలో పాల్గొనేలా ప్రోత్సమించేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. కులగణనలో పాల్గొనని వారికోసం ఆదివారం ప్రారంభమైన కులగణన ఈ నెల 28 వరకు కొనసాగనుంది. దీంతో తొలిరోజు బిసి కమిషన్ జంట నగరాల్లో వివిధ బస్తీల్లో పర్యటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పాత బస్తీ లోని చాంద్రాయణగుట్ట కుమ్మరిబస్తీలో ఇంటింటికీ వెళ్ళి కులగణన జరిగిందా? లేదా అనే సమాచారాన్ని సేకరించారు.
ఇంతవరకు కులగణనలో పాల్గొనని వారు ఏ విధంగా నమోదు చేసుకోవాలో వివరించి చెప్పారు. సుమారు రెండు వందల కుటుంబాల వద్దకు వెళ్లి సమాచారం సేకరించగా అందులో 72 కుటుంబాల వారు తమ కులగణన వివరాలు సేకరించ లేదని చెప్పారు. వారి ఇంటి నెంబర్లు తదితర వివరాలను, బిసి సంక్షేమ, మున్సిపల్ వార్డ్ అధికారులు నోట్ చేసుకుని, నమోదుకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. బిసి కమిషన్ చైర్మన్ తో పాటు బిసి సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆశన్న, స్థానిక ప్రముఖులు వెంకటేష్, నరేష్, శ్యాం తదితరులు చైర్మన్ వెంట ఉన్నారు. కాగా శాలివాహన నగర్, మలక్ పేటలో బిసి కమిషన్ సభ్యులు రాపోలు జయ ప్రకాష్, టిఎస్‌జిఓ కాలని, గచ్చి బౌతి లో సభ్యులు తిరుమలగిరి సురేందర్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యటించారు.