Friday, December 20, 2024

బిసిల కులగణన చేపట్టాలి…పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలి

- Advertisement -
- Advertisement -
కేంద్రమంత్రి అథ్వాలేకు బిసి నేతల వినతి

హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయమై ప్రధానమంత్రి తో చర్చించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బిసి నాయకులు సోమవారం కేంద్రమంత్రి రాందాస్ అథ్వాలే ని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అథ్వాలేను కలిసిన ప్రతినిధి బృందంలో బిసి నేతలు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, డా. నీల వెంకటేష్, నందగోపాల్, సుధాకర్, వేముల రామకృష్ణ, రాజ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

దేశాన్ని పాలించిన ప్రభుత్వాలేవీ 75 సంవత్సరాలుగా బిసిలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని వారు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలని అన్నారు. దేశ సంపద సృష్టిస్తున్న బిసిలకు ఆ సంపదను అనుభవించే హక్కు లేదని అన్నారు. పన్నులు కడ్తున్నారు కాని బడ్జెట్ లో కనీస వాటా దక్కడం లేదని పేర్కొన్నారు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు కాని అధికారంలో బిసి వాటా ఇవ్వడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం సేకరించబోయే జనాభా గణనలో కులాల వారిగా బిసి జనాభా గణన చేయాలని ఆయన కోరారు. ఎస్‌సి, ఎస్‌టిల జనాభా ను కులాల వారిగా సేకరిస్తూ బిసిల జనాభా సేకరించడానికి అభ్యంతరాలేమిటని ఆయన ప్రశ్నించారు. సుప్రీం కోర్టు, హై కోర్టు బిసి జనాభా లెక్కలు సేకరించాలని 40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం బిసి జనాభా లెక్కలు తీయకుండా అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని కోరారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్‌లు బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలని కోరారు. బిసిల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్‌ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని కోరారు. బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసిల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
కేంద్రమంత్రి హామీ
కేంద్రమంత్రి రాందాస్ అథ్వాలే మాట్లాడుతూ బిసిలకు అన్ని రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయినధని, స్వయానా ప్రధానమంత్రి బిసి అని, కేంద్రమంత్రి వర్గంలో 27 మంది మంత్రులు బిసి వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. ఈ డిమాండ్లు న్యాయమైనవని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి, బిసిల బడ్జెటు పెంచడానికి తన వంతు పాత్రగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయి న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రాందాస్ అద్వాలే హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News