Wednesday, January 22, 2025

అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన చేపడతాం: రాహుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్రలో భాగంగా గురువారం భూపాలపల్లి నుంచి పెద్దపల్లి వెళుతుండగా మధ్యలో ఆయన రోడ్‌షోలో ప్రసంగించారు. కుల గణనను దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యగా ఆయన అభివర్ణించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

కుల గణన ఎక్స్‌రే లాంటిదని, దేశంలో వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో నిర్ధారణ అవుతుందని ఆయన చెప్పారు. ఓబీసీలకు ఈ దేశ బడ్జెట్‌లో కేవలం ఐదు శాతం వాటా మాత్రమేనా, వారి జనాభా కేవలం ఐదు శాతం మాత్రమే ఉందా అంటూ ఆయన నిలదీశారు.

ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్నాటకలో కులగణనకు ఆదేశించామని ఆయన తెలిపారు. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముఒదుగా తెలంగాణ ఎక్స్‌రేకు ఆదేశాలు ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు. నిరుపేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధంగా ఆయన అభివర్ణించారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఈపోరాటంలో కెసిఆర్ ఓటమిపాలు కానున్నారని రాహుల్ జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News