Monday, December 23, 2024

పవర్‌లోకి వస్తే రెండు గంటల్లో కుల జనగణన: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు గంటల్లో కులాలవారి జనగణనకు దిగుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇది దేశవ్యాప్త ప్రక్రియ అవుతుందని తెలిపిన రాహుల్ ఛత్తీస్‌గఢ్‌లో తమ పార్టీ తిరిగి గెలిస్తే ఇదే ప్రక్రియ వెంటనే అమలు అవుతుందని ఎన్నికల వాగ్దానానికి దిగారు. రాష్ట్రంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతుల విశ్లేషణకు, వాస్తవిక పరిస్థితుల అంచనాకు కేవలం కులాలవారి జనగణననే రాజమార్గం అవుతుందని, ఇది కాంగ్రెస్ సూత్రీకరణ అని రాహుల్ తేల్చిచెప్పారు.ప్రధాని మోడీకి కులగణనపై విముఖత ఉందని తెలిపారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఏ విధంగా చితికిపోతే తనకేమిటి అనే వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా ఒబిసిల మాట చెపుతారని, వారికోసం పాటుపడుతామని అంటారని, దీనినే బిజెపి నేతలు ప్రచారం చేస్తారని, అయితే ఒబిసి ప్రాతిపదిక కులగణనకు ఎందుకు భయపడుతున్నారని ప్రధాని మోడీని, బిజెపిని రాహుల్ ప్రశ్నించారు.

పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తే కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందిస్తామని రాహుల్ వాగ్దానం చేశారు. ప్రధాని మోడీ తాను ఎంచుకున్న పారిశ్రామికవేత్తలకు మరింత తోడ్పాటు అందిస్తారని, ఇదే క్రమంలో పేదలు, వెనుకబడిన వర్గాల స్థితిగతులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరని ఇదీ ఆయన వ్యవహార శైలి అని మండిపడ్డారు. ప్రధాని మోడీ తరాజులో ఇరువైపులా ఉండేది అత్యంత సంపన్నులు, తాను కోరుకున్న తనను కోరుకున్న బడా పారిశ్రామికవేత్తలే అని వ్యాఖ్యానించారు. తాము పేదలు, కూలీలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, గిరిజనులు, దళితులు, బిసిల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం గొప్పలు ఎన్నో చెపుతుందని . అయితే చేతల్లోకి వచ్చే సరికి వారి సాయం అంతా అదానీజీకి చేరుతుందని విమర్శించారు. సిఎం భూపేష్ బఘేల్ చెప్పినదానిని బట్టి చూస్తే పలు ప్రాంతాల గనులు, ఎయిర్‌పోర్టులు , రేవులు అదానీకి కట్టబెట్టారు.

చివరికి వ్యవసాయ చట్టాలను కూడా అదానీకి మేలు జరిగేలా రూపొందించారని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లలోని తరతరాల సాంప్రదాయక ఆపిల్ పండ్ల సాగు , వ్యాపారాన్ని కూడా అదానీ కబ్జా చేశారని విమర్శించారు. రైతులు, పేదలకు అందే ప్రతి పైసాతో సత్ఫలితాలు ఉంటాయి. పల్లెలు పట్టణాలు అవుతాయి. పట్టణాలు నగరాలుగా విస్తరించుకుంటాయి. అయితే కొందరు పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల సంతర్పణలతో చివరికి మిగిలేదేమీ లేదన్నారు. వారికి ఇక్కడ అందే ధనం వారు విదేశాలలో భారీ స్థాయిలో ఆస్తులు కొనుక్కునేందుకు ఉపయోగపడుతున్నాయని, అవసరమైనప్పుడు, చట్టాలకు దొరకకుండా అక్కడనే తిష్టవేసుకునేందుకు విడిదిలు అవుతున్నాయని రాహుల్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News