మన తెలంగాణ / హైదరాబాద్ : కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సోమవారం సచివాలయం మీడియా సెంటర్ వద్ద ఆయన మాట్లాడుతూ బిసి లెక్కలను తక్కువ చేసి అగ్ర కులాల జనాభా ను ఎక్కువ చేసి చూపించడం బిసిలను అవమానించడమేనని ఆయనన్నారు. 2014 లో బిసిలు 51 శాతం ఉంటే 2024 లో 46 శాతం ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మోసం చేసిందని ఇది బిసి వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2024 వరకు 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారన్నారు.
ఈడబ్లుఎస్ రిజర్వేషన్ల ను కాపాడడం కోసం లేని అగ్రకులాల జనాభా ను చూపించడం పెద్ద కుట్ర అని ధ్వజమెత్తారు. బిసిలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బిసి సబ్ కమిటీకి భట్టి, పొన్నం ఉండాలి కాని ఉత్తమ్ ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. సమగ్ర కుల సర్వే రిపోర్ట్ ను ప్రజల ముందు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే రిపోర్ట్ లను చెత్తబుట్టలో వేస్తామని, ఈ నెల 5న బిసి సంఘాలు, మేధావులతో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని జాజుల వెల్లడించారు. మళ్ళీ బీహార్ తరహా లో రెండో సారి కుల గణన సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బిసి కుల గణన సర్వే పై ప్రభుత్వం పున సమీక్ష చేయాలని, అలా చేయకుంటే కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు.