మనుషుల్ని రంగు, రూపు, కులం, మతం ఆధారంగా విభజించి చూసే వివక్షాపూరిత విధానాలు సమాజంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహనీయులు కుల, మత వివక్ష నిర్మూలన కోసం ఇతోధికంగా పాటుపడ్డారు. సమాజ ప్రగతికి ఈ వివక్షాపూరిత విధానాలు భంగకరమంటూ ఎలుగెత్తి చాటారు. కానీ, వారి శిష్యులమని చెప్పుకుంటూ, ఆ మహానుభావుల జయంతులు, వర్ధంతులకు సభలు సమావేశాలను ఘనంగా నిర్వహించి చేతులు దులుపుకునే వారే నేటి సమాజంలో ఎక్కువయ్యారు తప్ప వారి ఆశయాలను ఆచరణలో పెట్టేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన ప్రదేశం వంటి వాటి ఆధారంగా వివక్ష చూపడం నేరమంటూ రాజ్యాంగంలోనూ మనం పొందుపరచుకున్నా, ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదనడానికి సాక్ష్యాలు కావలసినన్ని.
స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటినా ఇప్పటికీ కులవివక్ష నిక్షేపంలా వర్థిల్లుతోందనడానికి ప్రభుత్వ ఏలుబడిలో నడిచే జైళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తప్పు చేసినవారిని నిర్బంధించి, వాళ్లలో సత్ప్రవర్తన కలిగించేందుకు ఉద్దేశించిన జైళ్లే కులవివక్షకు కొమ్ము కాస్తున్నాయన్న నగ్నసత్యం తాజాగా సర్వోన్నత న్యాయస్థానం విచారణలో వెల్లడి కావడం విస్తుగొలుపుతోంది. మహారాష్ట్రకు చెందిన సుకన్య శాంత అనే ఓ పాత్రికేయురాలు జైళ్లలో ఇప్పటికీ కులవివక్ష నిరాఘాటంగా కొనసాగుతోందంటూ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా తీగ లాగితే డొంక కదిలినట్లు లోపభూయిష్టమైన జైలు మాన్యువళ్లు, అధికారుల కుల దురహంకారం వంటి అరాచకాలన్నీ వెలుగులోకి వచ్చాయి. జైళ్లలో ఊడ్చడం, మురుగు ట్యాంకులు శుభ్రం చేయడం వంటి పనులను ఇప్పటికీ కులం ఆధారంగానే అప్పగిస్తున్నట్లు వెల్లడైంది. వంట చేయడం వంటి పనులను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారు.
అంతేకాదు, ఖైదీలకు గదులు కేటాయించే విషయంలోనూ కులమే అర్హతగా మారడం విచారించదగిన విషయం. కులం ఆధారంగా పని విభజన చేయడం సమానత్వానికి వ్యతిరేకమంటూ చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలంటూ 11 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తూ, పని విషయంలో అందరికీ సమాన హక్కు కల్పించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. సమాజంలోని అన్ని రంగాలలోనూ కులమత వివక్షను నిర్మూలించి ఏళ్లు గడుస్తున్నా, జైలు మాన్యువల్స్‌లోనే ఇలాంటి వివక్షాపూరిత నిబంధనలు ఉన్నట్లు గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం.. వెంటనే మోడల్ ప్రిజన్ మాడ్యూల్ 2016, మోడల్ ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్ చట్టం 2023ను మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జైళ్లు అక్రమాలకు ఆలవాలంగా మారాయంటూ పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఎంతో కాలంగా అరచి గీ పెడుతున్నారు. కులమత వివక్ష మాత్రమే కాకుండా ఖైదీలకు సౌకర్యాలు సమకూర్చడంలో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తోందని అడపాదడపా వెలుగు చూస్తున్న సంఘటనలు తేటతెల్లం చేస్తూనే ఉన్నాయి.
డబ్బు గల ఖైదీలకు బయట నుంచి భోజనం సమకూర్చడం, సెల్ ఫోన్లు అందించడం వంటివి జైళ్లలో నిర్నిరోధంగా సాగిపోతూ ఉంటాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఇలాంటి అక్రమాలు బయటపడి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నా, మళ్లీ షరా మామూలే. జైలు నాలుగు గోడల మధ్య ఏం జరుగుతోందో సమాజానికి తెలిసే వీలు అంతగా లేని కారణంగా, కొందరు పోలీసు అధికారులు జైళ్లలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ ఉంటారు. ఖైదీల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తూ వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూంటారు. కానీ జైలు మాన్యువళ్లలోనే కుల వివక్షను ప్రోత్సహించే విధంగా నియమ నిబంధనలకు రూపకల్పన చేయడం సహించరాని విషయం. ఉదాహరణకు జైళ్లలో శుభ్రం చేసే పనులను మెహతర్ లేదా చందాల్ కులానికి చెందినవారే చేయాలని పశ్చిమ బెంగాల్ జైలు మాన్యువల్ చెబుతోంది.
కాస్త అటూ ఇటూగా ఇలాంటి నిబంధనలే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనూ ఉండటం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు మూడు నెలలలోగా మాన్యువళ్లను అప్‌డేట్ చేసి, ఖైదీల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేయడం అత్యంత ఆవశ్యకం. పరివర్తన అనేది ఖైదీలకే కాదు, వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే పోలీసు ఉన్నతాధికారులకూ వర్తిస్తుంది. ఖైదీల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ, వీలైనప్పుడలా వారిని హింసిస్తూ పైశాచికానందం పొందే జైలు సిబ్బందిలోనూ పరివర్తన కలిగేలా మాన్యువళ్లు రూపుదిద్దుకుంటే, జైళ్లు మానవతాలోగిళ్లుగా మారతాయనడంలో సందేహం లేదు.