Saturday, December 21, 2024

బీహార్ ‘కుల గణన’!

- Advertisement -
- Advertisement -

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు ఎంతో ఇష్టమైన కులాల వారీ జన గణనను చేపట్టారు. దేశంలో 90 ఏళ్ళ క్రితం ఈ తరహా జనాభా లెక్కల సేకరణ జరిగింది. గతంలో చిట్టచివరగా ఇటువంటి కృషి 1931లో బ్రిటిష్ వలస పాలకుల హయాంలో చోటు చేసుకొంది. బీహార్‌లో రెండు దశల్లో జరగనున్న ఈ పని మొన్న శనివారం నాడు ప్రారంభమైంది. మొదటి దశ ఈ నెల 21 వరకు కొనసాగుతుంది. రెండో దశ ఏప్రిల్ 1 నుంచి మొదలై 30వ తేదీన పూర్తి అవుతుంది. 12 కోట్ల మందితో దేశంలో మూడవ అతి ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన బీహార్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వమే కుల గణన జరిపించడం మామూలు విషయం కాదు. ఇందు కోసం నితీశ్ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. వాస్తవానికి కుల జన గణనను దేశ వ్యాప్తంగా జరిపించాలన్న డిమాండ్ కొత్తది కాదు. దీనిని బిగ్గరగా వినిపించిన ఖ్యాతి కూడా నితీశ్ కుమార్‌కే దక్కుతుంది.

ఆయన బీహార్‌కు ఎన్‌డిఎ ముఖ్యమంత్రిగా వుండగా గత జూన్‌లో రాష్ట్ర అసెంబ్లీలో కులాల వారీ జనాభా లెక్కలు తీయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదింప చేశారు. అప్పుడు పాలక కూటమిలో ప్రధాన భాగస్వామిగా వున్న భారతీయ జనతా పార్టీ అయిష్టంగానే ఆ తీర్మానానికి సహకరించింది. జాతీయ స్థాయిలో దీనిని చేపట్టడానికి బిజెపి తీవ్ర వ్యతిరేకంగా వున్న సంగతి తెలిసిందే. అయినా దానిని ఒప్పించడానికి నితీశ్ కుమార్ గట్టి ప్రయత్నమే చేసి విఫలమయ్యారు. గత ఆగస్టులో ఈ విషయమై బీహార్ అఖిల పక్షంతో ఆయన ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ అఖిల పక్షంలో అప్పుటి బీహార్ ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) కూడా వుంది. ప్రధాని గాని, బిజెపి గాని ససేమిరా అనడం నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతా దళ్, తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్‌జెడి ఏకం కావడానికి దోహదం చేసింది. నితీశ్ ఎన్‌డిఎ నుంచి విడిపోయి ప్రస్తుతం ఆర్‌జెడి మద్దతుతో ప్రభుత్వం నడుపుతున్నారు.

ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కేటాయించిన 10% రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ధ్రువపరచడంతో మొత్తం రిజర్వేషన్లపై దేశంలో కొత్త చర్చ మొదలైంది. రాజ్యాంగంలో కేవలం సామాజికంగా, విద్యావిషయకంగా (ఎస్‌ఇబిసిలు) వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్ల సదుపాయం కల్పించగా, దానితో పొసగని ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా చేసుకొని మోడీ ప్రభుత్వం ఇబిసిలకు విద్య, ఉద్యోగాల్లో 10 % కోటాను ప్రత్యేకించడం వివాదాస్పమైన సంగతి తెలిసిందే. ఇబిసి కోటాకు దేశ అత్యున్నత స్థానమే పచ్చ జెండా ఊపడంతో సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు వర్తించాలని కోరుకునే వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. 10% ఇబిసి కోటాను విడిగా పరిగణిస్తూ, ఒబిసిల కోటాపై 50 శాతం పరిమితిని కొనసాగించడం ఆ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ఈ పరిమితిని సడలించాలని, 50 శాతానికి మించి రిజర్వేషన్లను ఒబిసిలకు కల్పించాలని నితీశ్ కుమార్ వంటి వారు డిమాండ్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కులాల వారీ జన గణనను జరిపించి ఎవరు నిజంగా వెనుకబడి వున్నారో, ఏ సామాజిక వర్గానికి ప్రభుత్వ దన్ను అత్యధికంగా అవసరమో తేల్చాలని జనతా దళ్ (యు), ఆర్‌జెడి తదితర పార్టీలు కోరుతున్నాయి. అటువంటి గణనే దేశ ప్రజల వెనుకబాటు తనాన్ని చూపించే అద్దం అవుతుందని వారు భావిస్తున్నారు. దానిని జరిపిస్తే ఆర్థిక వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకొచ్చి చూపుతున్న తన బండారం బయటపడుతుందని బిజెపి భయపడుతున్నది. తనది కేవలం అగ్ర వర్ణ పక్షపాతమేనని రుజువువతుందని ఆందోళన చెందుతున్నది. బీహార్‌లో నితీశ్ కుమార్ చేపట్టిన కులాధార జన గణన స్వచ్ఛమైన ఫలితాలను ఇస్తుందో లేదో అనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చదువు అతి తక్కువగా వున్న రాష్ట్రంలో సిబ్బంది ఇంత సున్నితమైన గణనను బాధ్యతగా నెరవేర్చగలరో లేదో అనే సందేహాలు కూడా వినవస్తున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాలు పంచుకొంటున్నారని సమాచారం.

మొదటి విడతలో రాష్ట్రంలోని మొత్తం ఇళ్లను లెక్కబెడతారు. అయితే ఈ గణనలో కేవలం ప్రధాన కులాలనే గుర్తు పట్టాలని, ఉప కులాల జోలికి పోనవసరం లేదని నితీశ్ కుమార్ ఆదేశించినట్టు తాజా సమాచారం తెలియజేస్తున్నది. రిజర్వేషన్లను ఒకటి రెండు పైనున్న ఒబిసి కులాలే గంప గుత్తగా అనుభవిస్తున్నాయని, బాగా వెనుకబడిన తరగతులకు అవి అందడం లేదనే విమర్శ వుంది. వాస్తవానికి నితీశ్ కుమార్ అత్యంత వెనుకబడిన కులాలను తన వెంట సమీకరించుకోడంలో కృతకృత్యులయ్యారు. ఈ లెక్కల సేకరణ పర్యవసానాలు ఎలా వుండనున్నప్పటికీ దేశంలో సుదీర్ఘ కాలం తర్వాత కులాల వారీ జన గణన చేపట్టడం చరిత్రాత్మక పరిణామమే. కుల రహిత సమాజ అవతరణ దాదాపు అసంభవమనే చేదు వాస్తవాన్ని ఈ ఘట్టం నిరూపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News