ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణనలో కుల గణన చేపట్టాలనే అంశంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు , ఎంపి ఆర్.కృష్ణయ్య విపక్షాలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో బిసి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ కులాల వారి లెక్కలు తీయాలని 16 రాజకీయ పార్టీల నాయకులను కలిసిన తర్వాత అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవడం మంచి పరిణామమన్నారు.
బీహార్, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ , అస్సాం ప్రభుత్వాలు ఇదివరకే కులాల వారి లెక్కలు తీయాలని ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాయని, కులాల వారి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వానికి అన్ని పార్టీలు పార్లమెంటులో, పార్లమెంటు బయట గళం విప్పారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయకుండా బిసి వ్యతిరేక వైఖరి అవలంభించడం మానుకోవాలన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, రైల్వే, ఎల్‌ఐసి, బిహెచ్‌ఈఎల్, బిడిఎల్, బ్యాంకింగ్ , రక్షణ సంస్థలను ప్రైవేటు పరం చేయరాదని, అన్ని ప్రతిపక్షాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. పై రెండు ప్రధాన డిమాండ్ల సాధన కోసం పార్లమెంటులో ఉన్న 34 రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి జులై నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలని కృష్ణయ్య కోరారు.
ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంటు సమావేశాలను బహిష్కిరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం కులగణన అవసరమన్నారు. కులగణనతో ఒక్కో కులం జనాభా, సాంఘీక, ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించి వారి కులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని, నిధుల కేటాయింపు , పథకాల అమలుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో బిసి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురబ, కురుమ సంఘం అధ్యక్షులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం దక్షిణ భారత అద్యక్షులు జబ్బల శ్రీనివాసులు, గుజ్జ కృష్ణ, ఆంద్రప్రదేశ్ కురబ కర్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాశ్ బాబు, అనిల్, అంజి, అనంతయ్య, రాజేందర్, మరేష్ జోషి, సుధాకర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.