సినిమా పరిశ్రమలోనే కాదు , రాజకీయ రంగంలోనూ లైంగిక వేధింపుల క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు ఉన్నాయి. పార్టీల్లో కీలక పదవుల ఎరచూపి , సీనియర్ నేతలు కొత్తగా వచ్చిన మహిళా నేతల పట్ల లైంగిక చర్యలకు పాల్పడుతున్నారని కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సిమీ రోజ్‌బెల్ జాన్ ఆరోపించారు. ఆమె ఎర్నాకులం ప్రాంతానికి చెందిన నాయకురాలు . మలయాళ చిత్ర పరిశ్రమ మాలీవుడ్‌లో నటిమణులపై కొందరు సినీపెద్దల లైంగిక వేధింపుల వ్యవహారం, మీ టూ ఉద్యమం పరిణామాల నేపథ్యంలోనే రాజకీయ రంగంలోనూ ఇదే పరిస్థితి ఉందనేది కీలక అంశం అయింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక క్రమంలో తెరవెనుక లైంగిక వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఇక రాజకీయ ప్రత్యేకించి అధికారిక చదరంగపు పావులు, ఎత్తుగడల ఈ వేదికపై అనేక అక్రమాలు సాగుతున్నాయని సిమీ రోజ్‌బెల్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు అయిన ఆమె ప్రకటన తీవ్రసంచలనానికి దారితీసింది.
కీలక రంగాల్లో ఈ క్యాస్టింగ్ కౌచ్ సాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంలో అర్హత లేని వారు కీలక పదవుల్లో ఉన్నారని, వీరికి అందలం ఎందుకనేది తనకు అర్థం కాని విషయం అయిందన్నారు. చాలా మంది మహిళా నేతలు రాజకీయాల్లో ముందుకు పోవాలనుకుంటున్నవారు, మగ నేతల నుంచి అనేక లైంగిక వికృత చర్యలనే ఎదుర్కొంటున్నారు. పదవి కావాలంటే తాము చెప్పినట్లు చేయాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, పలువురు బాధితురాళ్లు తనకు ఈ విషయం తెలిపారని, వీటిని తాను సమయం చూసుకుని ఆధారాలతో వెలుగులోకి తీసుకువస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇతర చోట్ల రాజకీయాల పరిస్థితిపై తనకు అంతగా తెలియదని, అయితే కేరళ కాంగ్రెస్ యూనిట్‌లో ఇది తీవ్రస్థాయిలోనే ఉందని ఆరోపించారు. పార్టీలో పెద్దలు , ప్రత్యేకించి అధిష్టానవర్గం వద్ద పలుకుబడి పెంచుకున్న వారికే కేరళ కాంగ్రెస్ యూనిట్‌లో పెద్ద పీటలు దక్కాయని విమర్శించారు.
పార్టీ సీనియర్ నేత విడి సతీషన్ ఆగడాలకు అంతులేదన్నారు. ఓ వైపు మాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రాజుకున్న దశలో రాజకీయాల్లో కూడా దీని విషయం బయటపడింది. ఆమె తప్పుడు ఆరోపణలకు దిగారని, సంచలనంతో పేరు తెచ్చుకోవాలనో , మరో ఆలోచనతోనో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆమెపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటి పరిణామంపై కెపిసిసి అధ్యక్షులు కె సుధాకరన్ స్పందించారు. ఆమెపై ఫిర్యాదు అందిందని, తగు విధంగా నిజానిజాలు నిర్థారించడం జరుగుతుందని తెలిపారు.
సిమీ రోజ్‌బెల్‌పై పార్టీ తక్షణ వేటు
రాజకీయాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని తుపాన్ సృష్టించిన సిమీ రోజ్‌బెల్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర విభాగం గంటల వ్యవధిలోనే నిర్ణయం తీసుకుంది. ఆమె ఏ విషయం అయినా ఉంటే ముందుగా పార్టీలో తెలియచేయాలి. కానీ ఏకంగా మీడియా ముందుకు వెళ్లి లేనిపోని ఆరోపణలు చేయడం మహిళానేతలను కించపర్చడమే అని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) విమర్శించింది. ఆమెను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కు అయ్యి , సొంత పార్టీని దెబ్బతీసేందుకు ఆమె ఈ విధంగా వ్యవహరించారని పార్టీ మండిపడింది. ఇటువంటి ఆరోపణలతో మహిళా నేతలను మానసికంగా హింసించడం అవుతుందన్నారు. కాగా తనపై చర్య పట్ల రోజ్‌బెల్ స్పందించారు. గౌరవ మర్యాదలు ఉండే మహిళలెవ్వరూ పార్టీలో ఇమడలేరన్నారు.