టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ ఫణి. ఈ థ్రిల్లర్ సినిమాను ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏయు అండ్ ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మహేశ్ శ్రీరామ్‌కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈవెంట్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఫణి సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ఆదిత్య కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్ తోనూ రూపొందించగలడు.
వారి సోదరి మీనాక్షి నిర్మాణంలో ఫణి సినిమా చేస్తున్నాడు. కేథరీన్ అంటే సరైనోడులో ఎమ్మెల్యే గుర్తొస్తుంది. ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందనే ఆసక్తి కలుగుతోంది. ఫణి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా”అని అన్నారు. ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ డా.మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ “మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్‌లో ఫస్ట్ మూవీగా ఫణి సినిమాను నిర్మించాం. మొదట్లో చిన్న చిత్రంగా మొదలుపెట్టినా ఆ తర్వాత గ్లోబల్ మూవీగా తయారైంది. ఫణి సినిమాలో కేథరీన్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది. ఈ చిత్రంలో కేథరీన్‌తో పాటు పాము క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది”అని తెలిపారు. హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ – “ఫణి సినిమా కోసం ఆదిత్య నన్ను సంప్రదించినప్పుడు పాములంటే నాకు భయం, పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని కోరాను.
ఆయన సరే అన్నారు. అయితే షూటింగ్ చివరలో పాము కాంబినేషన్‌లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి తరహా సినిమా నేను ఇప్పటిదాకా చేయలేదు”అని తెలియజేశారు. డైరెక్టర్ డా.వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ “ఫణి సినిమాను కేథరీన్ ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది. అలా చివరకు గ్లోబల్ మూవీగా మారింది. కేథరీన్ మా సినిమాను ఒప్పుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో అంకితభావంతో పనిచేస్తోంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మహేశ్ శ్రీరామ్, శాస్త్రి అనిపిండి, పద్మనాభరెడ్డి, కాశీ విశ్వనాథ్, పద్మ పాల్గొన్నారు.