హైదరాబాద్: యుక్త వయస్సులోనే గుండెపోటు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జీవనశైలిలో మార్పులు, నిశ్చలంగా ఉండిపోయే ప్రవర్తన, ధూమపానం, మద్యపానం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఊబకాయం వంటి గుండెపోటుకు కారణాలుంటాయని వివరించారు. ఈ తరహా అలవాట్లు ఉన్నవారిలో ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్టు కావడం కూడ సంభవిస్తుందని తెలిపారు. 39 ఏళ్ల వయస్సున్న సినీనటుడు తారకరత్న కేసులో మీడియాలో కనిపించిన వీడియోను చూస్తే గుండెపోటు వచ్చి దానివల్ల అరిథ్మియాస్, దాని తరువాత గుండె ఆగిపోవడం సంభవించింది. ఈకేసులు పక్కన ఉన్నవాళ్లు వెంటనే కార్డియోపల్మనరీ రీససిటేషన్ చేసి, డిఫ్రిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే వీలైనంత వరకు కార్డియాక్ అరెస్టును నివారించగలిగేవారని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి చెందిన కార్డియాలజీ విభాగాధిపతి డా. హరిరామ్ తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉండే సామాన్య ప్రజలు సైతం సీపీఆర్ చేయవచ్చన్నారు. ఈవిషయం ప్రజలకు సీపీఆర్ గురించిన ప్రాథమిక జ్ఞానం గురించి శిక్షణ ఇవ్వాలి. కార్డియోవైర్షన్ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంటోంది. ఈరకం మిషన్లను ఏఈడీ అంటారు. వీటిని బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచి, వీటి ఉపయోగంపై ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. విమానాశ్రయాలు, కొన్ని హోటళ్లలో ఏఈడీలు అందుబాటులో ఉంటున్నాయి కానీ దీని ఎలా ఉపయోగించాలో ప్రజలకు తెలియాలి. తక్షణ చికిత్స అందించడంలో ఆలస్యమైతే, ముఖ్యమైన అవయవాలైన గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, ఉదరం, ఊపిరితిత్తులకు రక్త సరఫరా తగ్గిపోతుందని పేర్కొన్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను బట్టి చూస్తే 45 నిమిషాల తరువాత మాత్రమే గుండెకు రక్తప్రసారాన్ని పూర్తిగా పునరుద్దరించగలిగారు. అది చాలా ఎక్కువ సమయం.
దానివల్ల పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కుప్పంలో వైద్యులు వెంటనే బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి, ఒక ఇంట్రా ఆర్టిక్ బెలూన్ పంప్ పెట్టి, వాపోయాక్టివ్ మందులు ఇచ్చినట్లు వెల్లడించారు. ముందుగా రక్తపోటు, ఆక్సిజన్ సరఫరాలను మెరుగుపరచడం ద్వారా అన్ని అవయవాల కణజాలను సజీవంగా ఉంచడం వైద్యుల ముందున్న అతిపెద్ద సవాలని క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. శ్రీనివాస్ జక్కినబోయిన అభిప్రాయపడ్డారు. వీనో ఆర్టీరియల్ ఎక్స్‌ట్రాకార్బోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ సాయంతో బీపీ, ఆక్సిజన్‌ను సరిగా ఉంచొచ్చని తెలిపారు. కంటిన్యూవస్ రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారా మూత్రపిండాలను కాపాడవచ్చన్నారు.
అన్ని అవయవాలను కాపాడుతూ అదే సమయంలో శస్త్రచికిత్స, ఇతర పద్దతుల ద్వారా గుండె పనితీరును మెరుపరిచే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో మెదడు పనితీరును కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. గుండెకు రక్తప్రసారం పునరుద్దరణకు ఎక్కువ సమయం పట్టడంతో మెదడు పనితీరును జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తమ బీపీ, మధుమేహం, కొలెస్టరాల్ ఏ విధంగా పరీక్ష చేయించుకోవడంతో పాటు ఈసీజీ, టీఎండీ, 2డి ఎకోలాంటి గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిదని పేర్కొంటున్నారు. రోజువారీ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానం, దూమపానాలను వదలిపెట్టడం గుండెకుకు చాలా ముఖ్యమని వివరించారు.