Wednesday, January 22, 2025

పిడుగుపాటు కారణాలు

- Advertisement -
- Advertisement -

వడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది. అది భూమిని తాకిందా..! విలయాన్ని,ప్రళయాన్ని సృష్టిస్తుంది. దాని పేరే పిడుగు.భూమి మీద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకూ మేఘాలు ఏర్పడతాయి. పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి అధిక బరువుండే రుణావేశిత మేఘాలు కిందకి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం ఎక్కువైనప్పుడు ధనావేశం కొరకు గాలి ద్వారా భూమి వైపు రుణావేశ మేఘాలు వచ్చే క్రమంలో శక్తి వంతమైన విద్యుత్ఘాతం ఏర్పడుతుంది. దాని పేరే పిడుగు. పిడుగు దాదాపు ముప్పై కోట్ల ఓల్టుల విద్యుత్ ను కలిగి ఉంటుంది. ఇంటి కొరకే వాడే విద్యుత్ కేవలం 230 ఓల్టులతో పోలిస్తే ఇది ఎంత ప్రమాదకరమో చెప్పనవసరం లేదు. కొండ ప్రాంతాలలో రాత్రి మరియు తెల్లవారుఝామున , మైదానాలలో పగటి పూట , ఎండాకాలంలో సముద్రతీర ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా పిడుగులు పడతాయని అమెరికాకి చెందిన నాసా తెలిపింది. సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత 10000 డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటే, మెరుపు 50000 ఫారిన్ హీట్ ఉంటుంది. ఒక పిడుగు నుండి వచ్చే విద్యుత్ తో 100 వాట్స్ బల్బును 3 నెలలకి పైగా వెలిగించవచ్చు. పిడుగులు పడేచోట అక్కడున్న మనుషుల, పశువుల మరణంతోపాటు ఆస్తి నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎత్తుగా ఉండే చెట్లు, టవర్లు, నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పడతాయి. మన దేశంలో వర్షాకాలంలో 47.2 శాతం , వేసవి కాలంలో 41.5 శాతం , రుతుపవనాల అనంతరకాలంలో 7.7 శాతం పడుతున్నాయి. 2020 జూన్ 25 న ఒక్కరోజులోనే బీహార్ రాష్త్రంలో 83 మంది ఉరుములు , మెరుపులు తాకిడికి ప్రాణం కోల్పోయారు. నేషనల్ క్రైమ్ రికారడ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వీటి వల్ల యేటా 2000 మంది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారతీయ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మరియు వాతావరణ శాఖ సంయుక్తంగా ప్రచురించిన వార్షిక నివేదిక ప్రకారం 2020 నుండి 2021 సంవత్సరాల మధ్యలో 1697 మంది చనిపోయారు . ఇందులో ఎక్కువ మరణాలు ఉత్తర భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మొత్తం మరణాల రేటు సంవత్సరానికి మిలియనకు 0.25 మంది అని తెలిపింది. 2022 సంవత్సరంలో పిడుగు పాటు కారణంగా దేశంలో రికార్డ్ స్థాయిలో 2183 మంది మరణించారు. గత 14 ఏళ్లలో ఇదే అత్యధికం. మన కంటే అభివృద్ధి చెందిన పడమటి దేశాలతో పోలిస్తే పిడుగుపాట్లు వలన 100 రెట్లు ఎక్కువగా ప్రాణాలు పోతున్నాయి. లైట్నింగ్ రెసిలెంట్ ఇండియా క్యాంపెయిన్ 2019-2021 నివేదిక ప్రకారం పిడుగులు పడడంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో, తరువాత రెండు, మూడు స్థానాలలో ఛత్తీస్ఘడ్, మహారాష్ట్రలు ఉన్నాయి. మెత్తం చావులలో 66 శాతం పురుషులు , 34 శాతం స్త్రీలు ఉన్నారు. 62 శాతం పెద్దలు, 38 శాతం పిల్లలు , ఇందులో గిరిజనులు 68 శాతం, గిరిజనేతరులు 32 శాతం గాను , ఇంకా పట్టణ వాసులు 96 శాతం, గ్రామ ప్రజలు 4 శాతం గానూ ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఎక్కువగా వ్యవసాయ పనులు చేసే రైతులు, పశువుల కాపరులు, వారితో తోడుగా వెళ్ళే పిల్లలు ఉంటున్నారని నివేదించింది. ఢిల్లీకి చెందిన జియో స్పేషియల్ మరియు ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన ఆర్.యం.యస్.ఐ అధ్యయనంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, పశ్చిమ బెంగాల్ , ఝార్ఖండ్ లలో ఇటీవల సంవత్సరాలలో గరిష్టంగా పిడుగులు పడ్డాయని తేలింది. గతంలో చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఘోరమైన పిడుగుపాట్ల సంఘటనలు జరిగాయి . అవి 1769 సం.లో ఇటలీలో 90 వేల కిలోల గన్ పౌడర్ నిలువ వున్న ప్రాంతలో పిడుగు పడి దాదాపు 3000 మంది మరణించారు. 1963 సం.లో ఫిలడెల్ఫియాలో ఎగురుతున్న విమానంపై పిడుగు పడి 81 మంది ప్రయాణికులు చనిపోయారు.1971 సం.లో పెరూ లోని లిమా నుండి పుకల్పాకు వెళ్తున్న విమానం పిడుగుపాటుకు గురై అందులో ఉన్న 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 1994 సం. నవంబర్ 2 వ తేదీ నాడు ఈజిప్టులోని ఆర్మీ రిజర్వ్కి చెందిన ఇంధన ట్యాంకులు పేలి 469 మంది మరణించారు. న్యూ సౌత్ వేల్స్ లోని ఒక పొలం లో పిడుగుపాటుకు 68 ఆవులు బలయ్యాయి.

వ్యవసాయ పనులు చేసే రైతులు, ఆరు బయట పనిచేసే భవన కార్మికులు , నీటి గొట్టాలు బిగించే వారు , విద్యుత్ టవర్ల వద్ద పనిచేసే వారు, వాహనదారులు, పాదాచారులు పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారు.పిడుగు పాటుకి గురైన 10 మంది లో 9 మంది బ్రతికి బయట పడుతున్నారు. అయినా వీరు జ్ఞాపకశక్తి లోపించడం, తలతిరగడం, తిమ్మిర్లు వంటి లక్షణాలతో జీవితాంతం బాధపడతారు. పిడుగు నుండి వచ్చే ఎక్కువ శబ్ధం వలన చెవి నుండి మెదడుకు తీసుకువెళ్ళే న్యూరాన్లు బలహీన పడి శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే పిడుగు భూమి మీద పడేటప్పుడు వెలువడే అధిక వెలుతురు రేడియేషన్ కారణంగా పాక్షికంగా లేదా పూర్తిగా అంధత్వంనకు లోనవుతారు.

పిడుగులు ఎక్కువగా పడడానికి కారణం వాతావరణం లోని మార్పులు, భూతాపం, అటవీ నిర్మూలన, పర్యావరణ క్షీణత వంటి వాటివల్ల పడవలసిన వాటికంటే ఎక్కువ పిడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ప్రపంచ సగటు గాలి ఉష్ణోగ్రతలో ప్రతీ డిగ్రీ పెరుగుదలకు 12 శాతం అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు నివేదించారు.

మెరుపు నుండి వచ్చే వేడి వలన గాలిలోని నైట్రోజన్ మరియు ఆక్సిజన్‌తో కలసి నైట్రేట్‌లు మరియు ఇతర సమ్మేళనాలను ఏర్పడతాయి. వర్షాలు కురిసినప్పుడు, ఈ పోషకాలు భూమి లోపలికి చేరి మొక్కలు పెరగడానికి సహాయపడుతుంది. పడే పిడుగులను ఆపడం మన తరం కాకపోయినా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలము. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ వర్క్ మరియు ఇస్రో సహకారంతో 30 నుండి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఫోన్లకు ఎస్‌ఎంఎస్ లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ మొబైల్ ఫోన్ యాప్ దామిని ని ప్రవేశపెట్టారు. ఇది ఫోన్ చుట్టూ కనీసం 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల సమాచారాన్ని తెలుపుతుంది.

కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ కొన్ని సూచనలు చేసింది. ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్ళగూడదు. వర్షం వచ్చేటప్పుడు పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు దగ్గరలో ఉన్న భవనానికి చేరుకోవాలి. చెరువులు, నదులుకు దూరంగా ఉండాలి. చెట్లు కిందకు అసలు వెళ్ళకూడదు. కొండలు, పర్వత ప్రాంతాలు మీద ఉంటే వేగంగా దిగువకు వచ్చేయాలి. ఎత్తైన టవర్లు, విద్యుత్ స్తంభాలుకు దూరంగా ఉండాలి. చెరువులు, నదులలో ఈత కొట్టకూడదు. వాటిలో స్నానం చెయ్యకూడదు. క్రేన్లు, ట్రాక్టర్లుతో పని చేయకూడదు. మోటారు సైకిళ్లు మీద ప్రయాణం చెయ్యకూడదు. సెల్ ఫోన్లులో మాట్లాడకూడదు. తప్పనిసరైనప్పుడు నేల మీద నిల్చొని ఉండక, భూమి మీద అరికాళ్ళు పూర్తిగా పెట్టకుండా వేళ్ళమీద బంతిలా కిందకు వంగి చేతులను చెవులపై ఉంచి నేలపై పరుండాలి. ఇక ఇంట్లో ఉన్నవారు కూడా బాల్కనీ లో ఉండకూడదు. మొబైల్ ఫోన్లు , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడగూడదు. స్నానం చేయకూడదు. గిన్నెలు కడగ కూడదు. కిటికీలు , తలుపులకు ఆన్చి ఉండగూడదు. ఇంటి లోని నీటి గొట్టాలను ముట్టకుండా, నీటికి దూరంగా ఉండాలి. టి.వి లు , ఫ్రిజ్లు, స్విచ్ లు ఆపాలి. లేకుంటే విద్యుత్ తీగల ద్వారా అధిక ఓల్టేజ్ ప్రవహించి అవి కాలిపోడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలకు పై భాగంలో లైట్నింగ్ కండక్టర్ లను ఏర్పాటు చేసుకోవాలి. తుఫాను, కరువు, భూకంపం, అగ్ని, వరద, సునామీ , వడగళ్ళు, కొండ చరియలు విరిగిపడటం, హిమపాతం, క్లౌడ్ బరడ్స్, తెగుళ్ల దాడి, మంచు, మరియు తీవమైన చలిగాలులను మాత్రమే విపత్తులుగా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. పిడుగు పాటును కూడా విపత్తులుగా పరిగణించాలని దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. విపత్తుగా పరిగణిస్తే కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చడం వలన రాష్ట్రాలుకు మరింత ఎక్కువ మందిని పిడుగుల నుండి రక్షించే వీలుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News