Monday, December 23, 2024

కావేరి జలాల వివాదం!

- Advertisement -
- Advertisement -

పల్లెల్లో పొలం గట్ల వద్ద తగాదాల మాదిరిగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు తలనొప్పిగా తయారయ్యాయి. కర్నాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం చిరకాలంగా ఏటా రగులుతూనే వుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం, కృష్ణ నదీ లోయ బయటనున్న రాయలసీమకు నీరు మళ్ళించుకుపోడంపై పేచీ తెలిసినవే. జల వనరుల పంపిణీపై నియమించే ట్రిబ్యునళ్ళ తీర్పులు వెలువడడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టిపోడం, అవి వెలువడ్డ తర్వాత కూడా వివాదంలోని రాష్ట్రాలన్నింటికీ అంగీకారం కాకపోడం చిరకాలంగా కొనసాగుతున్న సమస్యే. కావేరి జలాల విషయంలో కర్నాటక తమిళనాడు మధ్య తాజాగా వివాదం రగులుతున్నది. వర్షాలు తగినంతగా కురిసి నదీలో నీరు పుష్కలంగా వున్నప్పుడు ఏ పేచీ తలెత్తదు. అంతా ప్రశాంతంగా వుంటుంది. కాని ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవకుండా నదిలో లోటు ఏర్పడినప్పుడే రగడ ఏర్పడుతుంది. ఈ ఏడాది కర్నాటకలో లోటు వర్షపాతం వల్ల కావేరిలో ప్రవాహం తగ్గిపోయిందని సమాచారం.

జూన్ నుంచి ఆగస్టు 17 వరకు 587.9 మి.మీ వర్షం కురవాల్సి వుండగా, 499.4 మి.మీ మాత్రమే పడిందని చెబుతున్నారు. రుతుపవనాల వైఫల్యం వల్ల ఈ ఎద్దడి సంభవించిందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కర్నాటక నుంచి తగినంతగా నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయాలంటూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానితో కర్నాటక కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసింది. ఏటా వివాదం తలెత్తినప్పుడల్లా తాత్కాలిక పరిష్కారాలతో సరిపుచ్చుకోడం వల్ల ఈ పేచీ మళ్ళీ మళ్ళీ రగులుతున్నది. రోజుకి 24000 క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేసేలా కర్నాటకను ఆదేశించాలని తమిళనాడు సుప్రీంకోర్టును కోరింది. మామూలు వర్షపాతం కురిసి కావేరిలో ప్రవాహం బాగా వున్నప్పుడు తమిళనాడు ఈ విధంగా కోరడం న్యాయమవుతుంది గాని ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా వుందని కర్నాటక న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ ఏడాది నదిలో 28.849 టిఎంసిల నీరు లోటుగా వుందని వివరించింది. తమిళనాడులో సాధారణ వర్షపాతం రికార్డయినప్పటికీ కర్నాటకను లోటు పీడిస్తున్నదని చెబుతున్నారు.

తమిళనాడుకు రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు విడుదల చేయాలని కావేరి జల నిర్వహణ సంస్థ కర్నాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కర్నాటక వేడుకొన్నది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. తమిళనాడు 69.777 టిఎంసిల నీటిని దుర్వినియోగం చేస్తున్నదని కర్నాటక న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు విచారణలో ఏమి తేలుతుందో, దాని తీర్పు ఎలా వుంటుందో అనే దానిని పక్కనపెడితే ఈ వివాదం రాజకీయ మలుపులు కూడా తిరగడం గమనించవలసిన విషయం. తమిళనాడు పాలక పక్షం డిఎంకె, కర్నాటక అధికార పక్షం కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వాములు కావడం వల్ల సిద్దరామయ్య ప్రభుత్వం తమిళనాడు పట్ల అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నదని కర్నాటక ప్రతిపక్షాలు బిజెపి, జెడి(ఎస్) ఆరోపించాయి. గురువారం నాడు బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశం ఒక సానుకూల పరిణామం. కర్నాటక రాజకీయ పక్షాలన్నీ ప్రధాని మోడీని కలిసి కావేరి నదీ జలాల పంపిణీకి సంబంధించి వాస్తవ పరిస్థితులను ఆయనకు వివరించాలని అఖిల పక్షం నిర్ణయించింది. ఈ విషయంలో సహకారం అందించడానికి బిజెపి అంగీకరించింది

. సుప్రీంకోర్టులో ఈ వివాదంపై ఈ నెల 25న వాదోపవాదాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నదిలో నీరు తక్కువైన సంవత్సరాల్లో పంపిణీ విషయమై ఒక శాస్త్రీయమైన పద్ధతిని రూపొందించాలని కర్నాటక కోరుతున్నది. కావేరి నది కర్నాటకలోని తలకావేరిలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈలోగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ప్రవేశిస్తుంది. ఎక్కువ భాగం తమిళనాడులోనే ప్రవహిస్తుంది. ఆ పొడుగునా ఆ రాష్ట్రంలో పంటలకు ప్రధాన ఆధారమవుతున్నది. అందుచేత కర్నాటక తమిళనాడు మధ్య కావేరి వివాదం తరచూ నిప్పులు చెరుగుతూ వుంటుంది. దేశంలోని అంతర్రాష్ట్ర నదులన్నింటికీ అన్ని సీజన్లకు వర్తించేలా వివాద పరిష్కార పటాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నదుల్లో ప్రవాహం తగ్గినప్పుడు పరీవాహక రాష్ట్రాల మధ్య అనుసరించదగిన ఖచ్చితమైన పరిష్కారాన్ని నిర్దేశించాలని కోరుతున్నారు. ఇది తప్పనిసరిగా అనుసరించదగినది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై పార్లమెంటు రెండు చట్టాలు చేసినప్పటికీ, ట్రిబ్యునళ్ళ ఏర్పాటుకు అవకాశాలున్నప్పటికీ పరీవాహక రాష్ట్రాల మధ్య పేచీలు నిరవధికంగా కొనసాగడం ఆందోళనకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News