Tuesday, November 5, 2024

రగిలిన కావేరీ జలవివాదం

- Advertisement -
- Advertisement -

రగిలిన కావేరీ జలవివాదం
నేడు బెంగళూరు బంద్ పిలుపు
అనుమతి లేదన్న పోలీసు కమిషనర్
బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్
ప్రజలలో అయోమయం
కరుణించని వానలతో నీటికటకట
బెంగళూరు: కర్నాటకలో కావేరీ జలాల వివాదం రగులుకుంది. తమిళనాడుకు కావేరీ జలాల పంపిణీని నిరసిస్తూ కర్నాటక జల సంరక్షణ సమితి (కెజెఎస్‌ఎస్) మంగళవారం బంద్‌కు పిలుపు నిచ్చింది. రైతుల అనుకూల, ఇతర సంస్థల సమిష్టి సంస్థగా ఈ సమితి ఏర్పాటు అయింది. నగర బంద్ నిర్వహణకు అనుమతినిచ్చేది లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద సోమవారం ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత నిర్వాహక సంస్థలకు తెలియచేసినట్లు వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకూ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, ఐదు అంతకు మించి వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో ఒకచోట గుమికూడరాదని ఆయన వివరించారు. ఎటువంటి బంద్‌కు అనుమతిని ఇవ్వరాదని ఇంతకు ముందు పలు సందర్భాలలో సుప్రీంకోర్టు, హైకోర్టు వెలువరించిన తీర్పులను ఈ సందర్భంగా కమిషనర్ ప్రస్తావించారు. తగు విధమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు, ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ ఇప్పటికే కర్నాటకలో ఆందోళనలు తలెత్తాయి.

సంస్థలు మంగళవారం బెంగళూరు బంద్‌కు, బుధవారం కర్నాటక రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయి. దీనితో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏర్పడ్డ తొలి సవాలుగా మారింది. బుధవారం నాటి రాష్ట్ర వ్యాప్త బంద్‌కు కన్నడ ఉద్యమకర్త వటాల్ నాగరాజ్ సారథ్యపు కన్నడ ఒక్కుట పిలుపు నిచ్చింది. మంగళవారం నాటి బెంగళూరు బంద్‌కు పిలుపు నిచ్చిన కర్నాటక జలసంరక్షణ సమితికి రైతు నేత కురుబురు శాంతకుమార్ సారధ్యం వహిస్తున్నారు. రెండు వేర్వేరు బంద్‌లతో ఇప్పుడు రైతులు, కన్నడ సంస్థలలో అయోమయం ఏర్పడింది. ఏ సంస్థ ఏ బంద్‌కు మద్దతు ఇస్తున్నదో తెలియని పరిస్థితి తలెత్తింది. తాము బెంగళూరు బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని కన్నడ ఒక్కుట నేతలు తెలిపారు. కాగా పలు సంస్థలు మంగళవారం నాటి బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని తెలిపాయి. రాష్ట్ర వ్యాప్త బంద్‌కు మద్దతు ఉంటుందని వెల్లడించారు.

బెంగళూరు బంద్‌కు జెడిఎస్ మద్దతు
తాము మంగళవారం నాటి బంద్‌కు మద్దతు ఇస్తామని జెడిఎస్ నేత హెచ్‌డి కుమారస్వామి సోమవారం తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బంద్ ప్రశాంతంగా జరగాలని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు సహకరించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏ విషయంపై అయినా ఎవరైనా నిరసనలకు దిగవచ్చునని, ఇది ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. అయితే ఎటువంటి నిరసనలు, ఆందోళనలు అయినా శాంతియుతంగా ఉండాల్సిందేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల గురించి మాట్లాడారని, దీనిపై మద్దతు ఇవ్వాలా? వద్దా అనేది వారి ఇష్టానికి వదిలిపెడుతున్నట్లు చెప్పిన డికె శివకుమార్ కావేరీ జలాలకు సంబంధించి బంద్‌లు, నిరసనలు కుదరవని ఇంతకు ముందు న్యాయస్థానాలు చెప్పిన విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలన్నారు. ప్రచారం కోసం ఏదో రాజకీయ లబ్థికి ఈ విధంగా ప్రజలతో ఆడుకోవడం ఎవరికి తగదని స్పష్టం చేశారు. లీగల్ చర్యలను అంతా గుర్తుంచుకోవల్సి ఉంటుందన్నారు. అయినా బంద్‌లపై ఏకాభిప్రాయం లేదని, వేర్వేరుగా బంద్‌లకు పిలుపు ఇచ్చారని, ఏది ఏమైనా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శివకుమార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News