మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో సిబిఐ, ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో ఒవైసి దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇళ్లు, ఆమె భర్తకు సంబంధించి ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లింపుల విషయంపై గతంలో సుల్తానా భర్తకు సంబంధించిన కంపెనీలపై సిబిఐ కేసు నమోదు చేసింది. గతంలో నమోదు అయిన కేసు విషయంపై అంజూమ్ సుల్తానా ఇళ్లు, కంపెనీలలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అంజూమ్ సుల్తానా భర్తకు అటో మొబైల్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాడు. ఆజాంపురలోని అంజూమ్ ఇంట్లో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ అంజూమ్ సుల్తానా, ఎజాజ్‌ఖాన్‌ల స్టేట్‌మెంట్‌ను సిబిఐ అధికారుల బృందం రికార్డు చేసింది. ఒకవైపు సిబిఐ దాడులు జరుగుతుండగానే మరోవైపు ఐటి సోదాలు కూడా నగరంలో పలుచోట్ల జరిగాయి.
మంజీరా కెమికల్స్‌పై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. 14 టీంలతో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగించారు. ఇక ఎక్సెల్ గ్రూప్ కంపెనీలపై ఐటీ దాడులు నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగు రోజులుగా నగరంలో 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లోనూ కూడా ఐటి తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సెల్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో కూడా ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశీ పెట్టుబడులతో పాటు ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై ఐటి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంజూమ్ సుల్తానా భర్త గతంలో ఆటో మొబైల్ షోరూమ్ నిర్వహించారు. ఆ సమయంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రుణాలు తిరిగి టైమ్‌కి చెల్లించకపోవడం, ఎగవేతకు పాల్పడటంతో బ్యాంకులు సిబిఐకు ఫిర్యాదు చేశాయి. దీంతో గతంలో సిబిఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం దాడులకు దిగినట్లు సమాచారం.