న్యూఢిల్లీ : దేశ రక్షణ రంగానికి చెందిన కీలక రహస్య సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందించారన్న నేరంపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రఘువంశీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్ట్ చేసింది. ఈ వివరాలను అధికారులు బుధవారం వెల్లడించారు. రఘువంశీ, పాఠక్‌లను స్పెషల్ సిబిఐ కోర్టు ముందు హాజరు పర్చగా, వారిని ఆరు రోజుల పాటు సిబిఐ కస్టడీకి పంపించారు. కొంతమంది భారతీయ జర్నలిస్టులు రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని విదేశీసంస్థలకు అందిస్తున్నారని, దీనివల్ల మిత్ర దేశాలతో భారత్‌కు ఉన్న దౌత్యసంబంధాలకు విఘాతం కలుగుతుందని సమాచారం అందడంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి రఘువంశీని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారిస్తోంది.
ఢిల్లీ పోలీస్‌ల నుంచి సిబిఐ ఈ కేసును స్వీకరించి విచారణ చేపట్టింది. జర్నలిస్ట్ రఘువంశీ రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ప్రాజెక్టుల వివరాలు, భవిష్యత్తులో రక్షణ దళాలు సేకరించనున్న ఆయుధాలు వంటి వాటికి సంబంధించిన అత్యంత కీలక సమాచారం విదేశాలకు అక్రమంగా వెల్లడించినట్టు కేసు నమోదైంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ 9 న సిబిఐ విచారణ చేపట్టింది. సమగ్రమైన దర్యాప్తు, పర్యవేక్షణతో లభించిన సమాచారం మేరకు మంగళవారం రఘువంశీ ఎక్కడెక్కడ ఉండేవాడో ఢిల్లీ ఎన్‌సిఆర్ , జైపూర్‌ల్లో 12 చోట్ల సిబిఐ మంగళవారం దాడులు నిర్వహించింది.
అమెరికాకు చెందిన డిఫెన్స్‌పోర్టల్ , రక్షణ వ్యవహారాల వెబ్‌సైట్‌లో కూడా భారతీయ జర్నలిస్టుగా రఘువంశీ పేరు నమోదై ఉంది. దాంతో పాఠక్‌తోపాటు రఘువంశీలను అదుపు లోకి తీసుకున్నారు. గూఢచర్యం, అధికార రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనమయ్యాయని , చట్టపరమైన పరిశీలనకు వాటిని పంపామని అధికారులు చెప్పారు.