టాటా ప్రాజెక్ట్ అధికారులు కూడా అరెస్ట్
న్యూఢిల్లీ : ఒక ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీఎస్ ఝా , ఆరుగురు టాటా ప్రాజెక్ట అధికారులను అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు గురువారం తెలిపారు. టాటా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు దేశ్‌రాజ్ పాఠక్, అసిస్టెంట్ ఉపాధ్యక్షుడు ఆర్‌ఎన్ సింగ్‌లు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ అభియోగాలకు సంబంధించి సీబీఐ అధికారులు ఘజియాబాద్, నొయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేశారు. బిఎస్ ఝా ఇంట్లో రూ. 93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈటానగర్‌లో బీఎస్ ఝా పనిచేస్తున్నారు. టాటా ప్రాజెక్టుకు చెందిన పలు ప్రాజెక్టులకు బీఎస్ ఝా అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు ఆరోపించారు. అందుకు ముడుపులు అందుకున్నారని తెలిపారు. టాటా ప్రాజెక్ట్ , ఇతర కంపెనీలకు వివిధ ప్రాజెక్టులపై అనుకూలంగా వ్యవహరించినందుకు ఆయా కంపెనీల నుంచి ఝా ముడుపులు స్వీకరించినట్టు సమాచారం అందినప్పటి నుంచి ఝాపై సీబీఐ అధికారులు నిఘా కొనసాగించారు. బుధవారం ముడుపులు స్వీకరిస్తున్న ఝాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.