Sunday, December 22, 2024

రాంచి రిమ్స్ ఎంబిబిఎస్ విద్యార్థిని అరెస్టు

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి ప్రశ్నాపత్రాలను దొంగలించిన ఒక ఇంజనీర్‌తో చేతులు కలిపి ప్రశ్నలకు జవాబులు తయారుచేసే ముఠాలో సభ్యురాలిగా పనిచేసిన రాంచిలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో ఎంబిబిఎస్ మొదటి సంవతర్సం విద్యార్థిని సురభి కుమారిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం సురభి కుమారిని సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. పంకజ్ కుమార్ చోరీ చేసిన నీట్ యుజి ప్రశ్నాపత్రానికి జవాబులు తయారుచేసేందుకు ఏర్పడిన ముఠాలో సురభి కుమారి ఐదవ సభ్యురాలని అధికారులు చెప్పారు. వీరంతా నీట్ పరీక్ష జరిగిన మే 5వ తేదీ ఉదయం హజారీబాగ్‌లో ఉన్నారని వారు తెలిపారు. హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ట్రంకు నుంచి నీట్ యుజి ప్రశ్నాపత్రాన్ని చోరీ చేసిన పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జంషెడ్‌పూర్(జార్ఖండ్)కు చెందిన 2017 బ్యాచ్ సివిల్ ఇంజనీర్.

నీట్ యుజి కేసులకు సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు 16 మంది వ్యక్తులను అరెస్టు చేసింది.ప్రశ్నాపత్రాన్ని సాల్వ్ చేసేందుకు ఏర్పడిన ఐదుగురు సభ్యుల ముఠాలోని మిగిలిన నలుగురు సభ్యులను ఎయిమ్స్ పాట్నా నుంచి సిబిఐ ఇదివరకు అరెస్టు చేసింది. ఈ నలుగురిలో ముగ్గురు ఎయిమ్స్ పాట్నాలో ఎంబిబిఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాగా ఒకరు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి. నీట్ పేపర్ లీకేజీ కేసులో సురభి కుమారి అనే ఎంబిబిఎస్ విద్యార్థినిని ప్రశ్నించాల్సి ఉందని సిబిఐ బుధవారం తమకు తెలియచేసిందని, ఇందుకు తాము పూర్తి సహకారం అందచేశామని రిమ్స్ పిఆర్‌ఓ రాజీవ్ రంజన్ విలేకరులకు తెలిపారు. గురువారం కూడా ఆమెను సిబిఐ ప్రశ్నించిందని ఆయన చెప్పారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని సందప్రదించారని, పరిస్థితిని వారికి వివరించామని ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రాన్ని సాల్వ్ చేసే బాధ్యతను పేపర్ లీకేజీ సూత్రధారులు ఈ ఐదుగురు సభ్యులకు అప్పగించారని సిబిఐ అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News