జమ్ము: తన హయాంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇస్తామన్న దానిపై ప్రశ్నించేందుకు సిబిఐ నేడు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్‌ను పిలిచింది. ‘ ఓ కేసులో కొన్ని విషయాలపై స్పష్టీకరణ కోసం సిబిఐ నన్ను హాజరు కమ్మని కోరింది. నా వీలును బట్టి ఏప్రిల్ 27 లేక 28 తేదీల్లో హాజరుకమ్మని కోరింది’ అని సత్యపాల్ మలిక్ ఓ పత్రికకు తెలిపారు.
2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న కాలంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ. 300 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆయన తెలిపారు. ఓ స్కీమ్‌ను ఆమోదించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకుడు రామ్ మాధవ్ తనకు డబ్బు ఇవ్వజూపారన్నారు. కాగా ఆ ఆరోపణలను రామ్ మాధవ్ నిరాధారం అని కొట్టిపారేశారు. పైగా ఆయన సత్యపాల్ మలిక్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విషయమై గత ఏడాది అక్టోబర్‌లో సత్యపాల్ మలిక్‌ను సిబిఐ ప్రశ్నించింది.
గత ఏడాది ఏప్రిల్‌లో సిబిఐ అవినీతి ఆరోపణలపై సత్యపాల్ మలిక్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదుచేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాంట్రాక్టును ఇవ్వడంలో, కిరు హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు రూ. 2200 కోట్ల సివిల్ వర్క్‌ను ఇవ్వడంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది.