న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చి డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ), ఆర్మీకి సంబంధించిన కీలకమైన సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందిస్తున్నాడన్న ఆరోపణలపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ఘ్రువంశీపై సిబిఐ కేసు నమోదు చేసింది. జైపూర్, ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో నిందితునితోసంబంధం ఉన్న కార్యాలయాలు, ఆయన సన్నిహితుల తాలూకు 12 ప్రాంతాల్లో సోదాలు చేసింది. లభ్యమైన కీలకమైన డాక్యుమెంట్లను చట్టపరమైన పరిశీలనకు సిబిఐ పంపింది.
నిందితుడు రఘువంశీతో దేశం లోను, విదేశాల్లోను ఎవరెవరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలుసుకోడానికి సమగ్రమైన దర్యాప్తు చేపట్టినట్టు సిబిఐ వెల్లడించింది. డిఆర్‌డివొ ప్రాజెక్టుల పురోగతికి చెందిన కీలకమైన సమాచారం నిందితుడు ఈపాటికే సేకరించాడని ఆరోపించింది. భారత సైనిక బలగాల భవిష్యత్ ఆయుధాల సేకరణ సమాచారం కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కానీ బయటకు వెళ్తే మిత్రదేశాలతో ఉన్న దౌత్యసంబంధాలు దెబ్బతినడమే కాక, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్నారు.