న్యూఢిల్లీ: అగస్టా వెస్‌ల్యాండ్ కుంభకోణంలో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన నలుగురు సిబ్బందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 నుంచి 2013 వరకు రక్షణ శాఖలో కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా పనిచేసిన శర్మపై కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతి లభించడంతో సిబిఐ ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనతోపాటు అప్పటి ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్(ఇప్పుడు రిటైర్డ్), డిపుటీ చీఫ్ టెస్ట్ పైలట్ ఎస్‌ఎ కుంతే, అప్పటి వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ, గ్రూప్ కెప్టన్ ఎన్ సంతోష్‌లను కూడా చార్జిషీట్‌లో సిబిఐ చేర్చింది. కుంతే, సంతోష్ ఎయిర్ కమోడోర్లుగా రిటైర్ అయ్యారు. 3,700 కోట్ల రూపాయల విలువైన 12 వివిఐపి హెలికాప్టర్లను అగస్టా వెస్ట్‌ల్యాండ్ నుంచి కొనుగోలు చేయడంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపిస్తూ సిబిఐ కేసు నమోదు చేసింది.