న్యూఢిల్లీ : ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభాషణల టేపులను కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా పరిశీలించడంలో అభ్యంతరకరం ఏమీ లేదని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కార్పొరేట్ సంస్థల మధ్య మధ్యవర్తిత్వం నెరపడమే వృత్తిగా సాగిన నీరా రాడియా టేపుల వ్యవహారంపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 2009 లో కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపునకు సంబంధించి నీరా రాడియా కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సిబిఐ సమర్పించిన వివరాలపై సుప్రీం కోర్టు, ఈ విషయంలో యథాతధ నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సిబిఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి విచారణకు హాజరయ్యారు.
రాడియా టేపుల వ్యవహారం గోప్యతహక్కుకు భంగం కలిగిస్తుందని, అందువల్ల రక్షణ కల్పించాలని పారిశ్రామిక వేత్త రతన్ టాటా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. టేపుల వ్యవహారంలో నమోదైన 14 కేసుల్లో ప్రాథమిక విచారణ జరిగిందని, ఇందులో నీరా రాడియా అక్రమాలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సుప్రీం కోర్టు ధర్మాసనానికి సీబీఐ న్యాయవాది భాటి వివరించారు. వచ్చేవారం రాజ్యాంగ ధర్మాసనం ఉన్నందున దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ జరుపుతామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సిబిఐ తాజా స్టేటస్ రిపోర్టును దాఖలు చేసే అవకాశం ఉన్నందున తదుపరి విచారణ అక్టోబర్ 12కు వాయిదా వేసింది.