Wednesday, January 22, 2025

లైంగిక వేధింపుల కేసులో మాజీ సిఎం ఊమెన్ చాందీకి సిబిఐ క్లీన్‌చిట్..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘సోలార్ స్కామ్’లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈమేరకు సిబిఐ, కోర్టుకు రిఫరల్ రిపోర్ట్ సమర్పించింది. 2012లో ఊమెన్ చాందీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘సోలార్ కుంభకోణం’ చోటు చేసుకుంది. సోలార్ యూనిట్ల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్టు యూడిఎఫ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ, తాను లైంగిక వేధింపులకు గురైనట్టు 2013 జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊమెన్ చాందీ సహా, కొందరు మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది.

దీంతో దర్యాప్తు చేపట్టిన కేరళ క్రైంబ్రాంచ్ పోలీసులు, చాందీ, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసును ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. అయితే ఇది రాజకీయంగా తీవ్ర దుమారానికి తెరలేపింది. ఈ నేపథ్యం లోనే దర్యాప్తు చేపట్టిన సీబీఐ, తాజాగా రిఫరల్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మాజీ సీఎం చాందీకి వ్యతిరేకంగా సదరు మహిళ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ దర్యాప్తులో తేలినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఫిర్యాదులో చెప్పినట్టుగా ఆ మహిళ.. చాందీ నివాసానికి వెళ్లినట్టుగా ఎలాంటి సాక్షాలు లభించలేదని పేర్కొన్నాయి. దీంతో ఆయనకు ఈ కేసులో సిబిఐ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News