Monday, December 23, 2024

దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు ఎదుర్కొన్నవారు 124 మంది అయితే అందులో 118 విపక్షీయులే ఉన్నా రు. అంటే రెండు పాలనల కాలంలో ప్రతిపక్ష శాతం 60 నుండి 95 కు పెరిగింది. యుపిఎ ప్రభుత్వం 29 మంది సొంత వారిపై దర్యాప్తుకు ఆదేశిస్తే ఎన్‌డిఎ మాత్రం ఆరుగురు బిజెపి పక్షంవారిపై సిబిఐని పంపింది. ఈ వ్యత్యాసమే విపక్షనేతలకు లేఖరాసేబలాన్ని ఇచ్చిందనవచ్చు. సిబిఐ, ఇడి, ఐటి స్థాయి మహాబలి శక్తులు రాష్ట్రాల చేతుల్లో లేనందువల్ల కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు లేఖాస్త్రమే మిగిలింది. అయితే ఆ అస్త్రం కొంచెమైనా ప్రధానిని పునరాలోచించుకొనేలా చేస్తుందని అనుకోలేము. ఎందుకంటే లేఖ రాసిన మర్నాడే ఆ లేఖపై సంతకం చేసిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తల్లి, బీహార్ మాజీ సిఎం అయిన రబ్రీదేవిని నివాసంలో 4 గంటల పాటు సిబిఐ ప్రశ్నించింది.

దేశంలో అత్యున్నత నేర విచారణ సంస్థలైన సిబిఐ, ఇడిల వ్యవహార శైలిని నిరసిస్తూ తొమ్మిది ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం వెనుక ఒక అనివార్యత, తప్పనిసరి పరిస్థితి కనబడుతోంది. నలుగురు ముఖ్యమంత్రులు, అయిదుగురు విపక్ష పార్టీల అగ్రనేతలు కలిసి ఈ లేఖను సిద్ధం చేసినట్లు వార్తల్లో వచ్చింది. మోడీ పాలనపై సూటిగా విమర్శలకు దిగుతున్న కెసిఆర్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రుల హోదాలో దేశ ప్రధానికి కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై లేఖ రాయడం ఒక వైపు ఇంటి పెద్ద యొక్క నడక బాగా లేదని గుర్తు చేస్తున్నట్లుగా, మరో వైపు ఆ సంస్థల విధానాన్ని ఎండగట్టినట్లుగా ఉంది. ఈ మూడు పేజీల లేఖలో ఆ సంస్థల పక్షపాత ధోరణిని, కేవలం విపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొనే తీరును, విచారణను ఎదుర్కొంటున్నవారు బిజెపిలో చేరగానే వారి కేసులను నీరుగార్చే తంతును ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ప్రధానిగా ఇలాంటి లేఖను అందుకోవడం మోడీకి కొంత చిన్నతనమే అనుకోవాలి. పాలనలోని తప్పును ఎత్తిచూపుతున్నట్లుగా ఉన్న ఈ లేఖకు ప్రధాని కార్యాలయం అందుకుని, అధికారికంగా స్వీకరించి సమాధానం ఈయవలసిన అవసరముంది. వేదికలపై విమర్శించుకున్న దానికి, హోదాపరంగా రాసిన లేఖకు వ్యత్యాసముంటుంది. ఆ లేఖలో నేతలు ఎత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం రాతపూర్వకంగా ఈయాలి. ఈ లేఖ ప్రధానిని ఉద్దేశించి రాసినా ఆయా దర్యాప్తు సంస్థల పెద్దలను కూడా ప్రశ్నించినట్లే అనుకోవాలి. తాము కేంద్ర ప్రభుత్వానికి ‘కీలుబొమ్మలు’గా వ్యవహరించడం లేదని రుజువు చేసుకోవలసిన బాధ్యత వాటి సారథులైన అధికారులపై కూడా ఉంది. ఈ లేఖ వల్ల ప్రధానిపై కన్నా తమపైనే ఎక్కువ మచ్చపడే ఆస్కారం ఉందని వారు గ్రహించాలి. ఆ సంస్థల ప్రతిష్ఠతో వారి గౌరవ మర్యాదలు కూడా ముడిపడి ఉంటాయి. విధుల నిర్వహణలో వారి నిజాయితీ, నిబద్ధతలను జాతి గుర్తించుకుంటుంది.

కోర్టు ఉత్తర్వుల మేరకు మా విధులు నిర్వహిస్తున్నామని ఆ అధికారులు చెబుతున్నా అది జనం మెచ్చే సమాధానం కాదు.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మరోసారి సిబిఐ కస్టడీలోకి తీసుకొన్న నేపథ్యంలో ఈ నేతలు అనివార్యంగా లేఖ రూపంలో ప్రధాని తలుపు తట్టినట్టుగా గోచరిస్తోంది. వాస్తవం గమనిస్తే చట్టానికి చిక్కకుండా ధనాన్ని కూడబెడితే తప్ప ఎన్నికల ఖర్చు గట్టెక్కని పరిస్థితి నేడు ఏర్పడింది. పార్టీలకు గాని, అభ్యర్థులకు గాని ప్రభుత్వ పనులపై, పాలసీ నిర్ణయాలపై కమిషన్లు దండుకుంటేనే రాజకీయ మనుగడ ముందుకు సాగేలా ఉంది. అయితే ఇందులో ఏ పార్టీకి మినహాయింపు ఉండదు.

ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే దర్యాప్తు సంస్థల కొరడా చేపట్టిన పాలక బిజెపి కేవలం విపక్షాల వారిపై మాత్రమే దానిని ఝుళిపించడమే. దాడులు చేయిస్తామని బెదిరించి ఆయా పార్టీల కీలక నేతలను తమ బుట్టలో వేసుకోవడమే. రాజకీయ ఎత్తుగడగా బిజెపి వైపు నుండి సాగుతున్న సిబిఐ, ఇడి, ఆదాయపు పన్ను శాఖల దాడులను తట్టుకోలేక వివిధ ఇతర పార్టీల నేతలు మనలో మనకు ఇది మంచిది కాదని మోడీని నిలువరించే ప్రయత్నంలో భాగమే ఈ లేఖ అనుకోవాలి.ఈ దర్యాప్తు సంస్థల తీరుతెన్నులు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ, భాజపా ప్రధాన భాగస్వామి అయిన ఎన్‌డిఎ హయాంలో ఎలా మారాయో గణాంకాలతో పత్రికలు కథనాల్ని రాసి కాంగ్రెస్ కాలమే నయమని తేల్చుతున్నాయి.

కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు ఎదుర్కొన్నవారు 124 మంది అయితే అందులో 118 విపక్షీయులే ఉన్నా రు. అంటే రెండు పాలనల కాలంలో ప్రతిపక్ష శాతం 60 నుండి 95 కు పెరిగింది. యుపిఎ ప్రభుత్వం 29 మంది సొంత వారిపై దర్యాప్తుకు ఆదేశిస్తే ఎన్‌డిఎ మాత్రం ఆరుగురు బిజెపి పక్షంవారిపై సిబిఐని పంపింది. ఈ వ్యత్యాసమే విపక్షనేతలకు లేఖరాసేబలాన్ని ఇచ్చిందనవచ్చు.

సిబిఐ, ఇడి, ఐటి స్థాయి మహాబలి శక్తులు రాష్ట్రాల చేతుల్లో లేనందువల్ల కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు లేఖాస్త్రమే మిగిలింది. అయితే ఆ అస్త్రం కొంచెమైనా ప్రధానిని పునరాలోచించుకొనేలా చేస్తుందని అనుకోలేము. ఎందుకంటే లేఖ రాసిన మర్నాడే ఆ లేఖపై సంతకం చేసిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తల్లి, బీహార్ మాజీ సిఎం అయిన రబ్రీదేవిని నివాసంలో 4 గంటల పాటు సిబిఐ ప్రశ్నించింది. 2004- 09 కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ఉద్యోగ నియమాకాల్లో అవినీతికి పాల్పడ్డట్లుగా ఉన్న అభియోగం పేరిట ఈ ప్రశ్నలు రబ్రీపై కురిశాయి. ‘రాజకీయ నాయకులపై వచ్చిన ఆరోపణలలో అబద్ధాల కన్నా నిజాలే ఎక్కువగా ఉంటాయి. అందులో అసలు సిసలు నేరగాళ్లు చాలా ఉంటారు. అయితే సంస్థలు స్పందిస్తున్న సమయాన్ని, తీరును ప్రశ్నించవచ్చు. ఏళ్ల తరబడి ఊరికెనే కాలం గడిపి ఎన్నికల ముందుగానో లేదా మరో కీలక సమయంలో అవసరమున్న కేసు దుమ్ముదులిపి నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ దురుద్దేశమే’ అని సిబిఐ మాజీ అధికారి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘అన్ని కాలాల్లోనూ రాజకీయ ఒత్తిళ్లు తప్పకుండా వస్తుంటాయి. వాటికి తలొగ్గడమనేది ఆయా అధికారుల నిజాయితీ, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటాయి’ అని ఆయన అన్నారు.

యుపిఎ హయాంలోనూ ఈ సంస్థలను రాజకీయ కోణంలో వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2013లో తమ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించగానే డిఎంకె నేత స్టాలిన్ ఇంటిపై సిబిఐ దాడి జరిగింది. 33 లక్సరీకార్లు ఎలా కొన్నావని ప్రశ్నించింది. ఎన్నో ఏళ్లుగా కొంటు న్న కార్ల లెక్క ఇప్పుడు అడగడం సంస్థల అధికార దుర్వినియోగమే అవుతుంది. 2007లో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఎస్‌పి నేత ములాయం సింగ్ యాదవ్ ను నిలదీసిన సిబిఐ.. ఆయన కాంగ్రెస్‌కు సహరించడంతో 2013లో కేసు మూసివేసింది. 2009లో కాంగ్రెస్ మాట పట్టించుకోనందుకే వైఎస్ జగన్ జైలు పాలై కేసులను ఎదుర్కొంటున్నాడు అని అనుకునేవారు ఎందరో ఉన్నారు.

ఇక బిజెపి విషయానికొస్తే ప్రత్యర్థులపై ఇడి, సిబిఐ దాడుల పరంపర దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపియేతర ప్రభుత్వాలపై వరుసగా కొనసాగుతోంది. అలాగే తమను విమర్శించే వార్త సంస్థలపై కూడా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేసిన వెంటనే బిబిసి వార్త సంస్థకు చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీ చేపట్టింది. రాజకీయ నాయకులపై ఎలాంటి కేసులు కోర్టులో ఉన్నా, ఎన్ని దర్యాప్తులు జరిగినా నిజాలు బయటపడి ఊచలు లెక్కపెట్టే సందర్భాలు అరుదు. అయితే ఈ దాడులు, దర్యాప్తుల వార్తలు రాజకీయ మనుగడను దెబ్బ కొడుతాయనే భయమే నేతల్లో ఎక్కువ. దాడులు నిర్వహించేవారి ఉద్దేశం కూడా అదే. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆయుధాల కొనుగోలులో అవకతవకలను అరికట్టేందుకు 1941లో ఏర్పడ్డ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రూపురేఖలు క్రమంగా మారి ఇప్పుడు కేవలం పాలకపక్ష రాజకీయ ప్రయోజనాలకు సేవికగా మారడం చారిత్రక విషాదం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News