శత్రుఘ్న సిన్హా విసుర్లు
కోల్‌కత: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు ”అతి పెద్ద మిత్రులని” మాజీ కేంద్ర మంత్రి, మాజీ బిజెపి నాయకుడు శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిన్హా మ ంగళశారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ప్రభుత్వాన్ని నియంతగా అభివర్ణించారు. ఎన్‌డిఎలో మిత్రపక్షాలన్నీ వెళ్లిపోయాయని, ఇప్పుడు రాజును మించిన విధేయతను ప్రదర్శిస్తున్న సిబిఐ, ఇడి వంటి సంస్థలే అతి పెద్ద మిత్రులుగా కేంద్రానికి మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, అయితే రాజకీయ విభేదాలను సమీప భవిష్యత్తులో పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. బిజెపిని వీడిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన తాను కాంగ్రెస్‌ను వీడడానికి గల కారణాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు సరైన మార్గంలో వెళ్లేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకోక తప్పదని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాను బయటి వ్యక్తినంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బెంగాలీలలో ఎవరికీ తీసిపోనని ఆయన చెప్పారు.