భువనేశ్వర్ : ఒడిశా రైలు దుర్ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ , ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సిబిఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. రైల్వే చట్టం లోని 153 సెక్షన్‌తోపాటు సాక్షాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో సమానమైన నేరాభియోగాలను మోపింది. రైలు ప్రమాదంలో కుట్ర కోణం అనుమానాల నేపథ్యంతో రంగం లోకి దిగిన సీబీఐ, జులై 7న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్స్) అరుణ్‌కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది.
బాహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94 వ లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షం లోనే జరిగాయి. అయితే ఈ పనులకు 79వ లెవెల్ క్రాసింగ్ గేట్‌కు సంబంధించిన సర్కూట్ , రేఖాచిత్రాన్నే ఉపయోగించారు అని సిబిఐ పేర్కొంది. ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడమనేది .. ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా ఉన్నాయనేది నిర్ధారించుకోవడం మహంత పని. కానీ ఆయన దీన్ని విస్మరించారు. అని తెలిపింది. ఇటీవల మహంత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగానూ సిబిఐ ఇదే వాదనలు వినిపించింది. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది.