Monday, December 23, 2024

రూ.50 లక్షలు తీసుకుని చైనీయులకు వీసా

- Advertisement -
- Advertisement -

CBI files new case against Karti Chidambaram

కార్తి చిదంబరంపై సిబిఐ కొత్త కేసు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు , ఎంపీ కార్తిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) మరో కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. అయితే ఈ తనిఖీలపై కార్తి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. తమ ఇంట్లో సీబిఐ రికార్డు స్థాయిలో సోదాలు చేసి ఉంటుందని విమర్శించారు. కేంద్రంలో యూపీఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కార్తి రూ.50 లక్షలు తీసుకుని 250 మంది చైనా దేశస్థులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సిబిఐ ఆయనపై కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మంగళవారం కార్తికి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై సహా ముంబై, కర్ణాటక, పంజాబ్, ఒడిశా, ఢిల్లీ లోని 9 ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ తనిఖీలు జరిగాయి.

కార్తి తండ్రి చిదంబరం నివాసం లోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం. అయితే ఈ తనిఖీలపై కార్తి ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. “కౌంట్ మర్చిపోయా… ఎన్నిసార్లు ఇలాంటి సోదాలు జరిగి ఉంటాయి? బహుశా ఓ రికార్డు అయ్యి ఉంటుంది ”అని రాసుకొచ్చారు. కార్తి పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ మీడియా అనుమతులు, ఎయిర్‌సెల్ ఒప్పందం విషయాల్లో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సిబిఐ, ఈడీ ఆయనపై పలు కేసులు నమోదు చేశాయి. ఆయన తండ్రి చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఐఎన్‌ఎక్స్ కేసులో 2018 లో సిబిఐ కార్తిని అరెస్టు చేయగా, నెల తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News