Monday, January 20, 2025

ముందురోజు రాత్రి ఏం జరిగింది?.. ట్రెయినీ డాక్టర్‌తో నలుగురు డాక్టర్ల డిన్నర్

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన 31 సంవత్సరాల పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ సహచరులైన నలుగురు సహచరులకు లై డిటెక్టర్(పాలిగ్రాఫ్) పరీక్షను నిర్వహించనున్నట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నలుగురిలో ఇద్దరు మొదటి సంవత్సరం పిజి ట్రెయినీలు కాగా, ఒకరు హౌస్ సర్జన్. మరొకరు ఇంటర్నీ. ఈ నలుగురు పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఇవ్వడంతో వీరికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సిబిఐ భౠవిస్తోంది. ఈ నలుగురు డాక్టర్లు నేరంలో పాల్గొన్నారని సిబిఐ అనుమానించడం లేదని, అయితే సాక్ష్యాలను చెరిపేయడంలో కాని లేదా కుట్రలో కాని వీరి పాత్రను నిర్ధారించుకోవాలని సిబిఐ భావిస్తోందని వర్గాలు తెలిపాయి. ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ముందు రోజు రాత్రి జరిగిన పరిణామాలను సిబిఐ అధికారులు వరుసగా పేర్చుకుంటూ నేరం జరిగిన తీరును కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

ట్రెయినీ డాక్టర్ మృతదేహం లభించిన మూడవ అంతస్తులోని సెమినార్ హాలులో ఆమె సహచర విద్యార్థులైన నలుగురు డాక్టర్లలో ఇద్దరి వేలిముద్రలు సిబిఐకి లభించాయి. ఆ రోజు రాత్రి హౌస్ సర్జన్ మొదటి అంతస్తు నుంచి మూడవ అంతస్తులోని సెమినార్ హాలులోకి వెళ్లడాన్ని అక్కడి సిసి టివి కెమెరా రికార్డు చేసింది. తల్లవారుజామున 2.45 గంటలకు తాను మూడవ అంతస్తుకు వెళ్లానని హౌస్ సర్జన్ తెలిపాడని, మూడవ అంతస్తులో ఉన్న ఇంటర్నీ ఆ రోజు రాత్రి ట్రెయినీ డాక్టర్‌తో మాట్లాడాడని సిబిఐ గుర్తించింది. ముందు రోజు రాత్రి అర్ధరాత్రి ట్రెయినీ డాక్టర్ ఇద్దరు మొదటి సంవత్సరం పిజి ట్రెయినీలతో కలసి డిన్నర్ చేసినట్లు వర్గాలు తెలిపాయి.

అనంతరం వారంతా సెమినార్ రూముకు వెళ్లి ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను టీవీలో వీక్షించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ ఇద్దరు సహచరులు డ్యూటీ డాక్టర్లు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లిపోయారు. ట్రెయినీ డాక్టర్ మాత్రం సెమినార్ హాలులోనే ఉండిపోయారు. తాను ఇంటర్నీల రూములో ఉన్నట్లు ఇంటర్నీ తెలిపాడు. ఈ మూడు గదులు సెమినార్ హాలుకు సమీపంలో మూడవ అంతస్తులోనే ఉండడం గమనార్హం. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు పిజి ట్రెయినీ డాక్టర్లలో ఒకరు తాము ముందు రోజు రాత్రి డిన్నర్ చేసిన ట్రెయినీ డాక్టర్‌ను చూసేందుకు వెళ్లాడు. కొంత దూరంలో చలన లేకుండా పడిఉన్న ఆమె మృతదేహాన్ని అతను చూశాడు. వెంటనే ఈ విషయాన్ని తన సహచరులకు, సీనియర్ డాక్టర్లకు తెలియచేశాడు. వారు వెంటనే ఆసుపత్రి అధికారులకు సమాచారం అందచేశారు. ఈ నలుగురు డాక్టర్లతోపాటు కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించడానికి సిబిఐకి కోర్టు నుంచి అనుమతి లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News