Monday, December 23, 2024

కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ

- Advertisement -
- Advertisement -

హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం కోరినా రంగంలోకి దిగుతాం
న్యాయస్థానానికి స్పష్టం చేసిన సిబిఐ

ఫిబ్రవరి 2న తేలనున్న వ్యవహారం

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్టు హై కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పష్టం చేసిం ది. హైకోర్టు ఆదేశాలిచ్చినా ,లేదా రాష్ట్ర ప్రభు త్వం కోరినా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది. అయితే దర్యాప్తునకు అ వసరమైన వసతులు ఆర్ధిక వనరులు కల్పించాల్సివుంటుందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, డిజైన్లలో మా ర్పులు చేర్పులు జరిగాయని, పనులు నాశిరకంగా చేసి, అంచనాలు పెంచి భారీగా సోమ్ముచేసుకున్నారని, ప్రజాధనం పక్కదారి పట్టిందన్న విమర్శలు సందేహాలతోపాటు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐకి చేసిన ఫిర్యాదులలో కోరినప్పటికీ సిబిఐ నుంచి స్పందనరాలేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్‌ను విచారణకు చేపట్టిన హైకోర్టు కాళేశ్వరంపై దర్యాప్తు విషయంలో దాఖలైన  పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సిబిఐకి సూచించింది. ఈ నేపధ్యంలోనే సిబిఐ హైదరాబాద్ బ్రాంచ్‌కి చెందిన ప్రధానఅధికారి డి.కళ్యాణ్ చక్రవర్తి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అందులో పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కాళేశ్వరం ఎతిపోతల సాగునీటి పధకంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైన నేరుగా కల్పించుకుని దర్యాప్తు చేయలేమని తెలిపారు. ఈ అంశంలో సిబిఐకి పరిమితులు ఉన్నట్టు తెలిపారు. అంతే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అవరమైన రుణసదుపాయం కల్పించి నిధులు అందజేసిన ఆర్ధిక సంస్థలనుంచిగాని, బ్యాంకుల నుంచిగాని సిబిఐకి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. అయితే ఇదే అంశపై పిటీషనర్ దాఖలు చేసిన ఫిర్యాదుపైన పరిశీలన జరుగుతున్నట్టు తెలిపారు.

ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఎవరి పాత్ర ఎంత అన్నది తెలియాల్సివుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల పాత్రవుంటే విచారణకు అవకాశాలు ఉంటాయని, అదే రాష్ట్ర ప్రభుత్వ ఆధికారుల ప్రమేయం ఉంటే మాత్రం నేరుగా జోక్యం చేసకునే అవకాశం సిబిఐకి ఉండదని వివరించా రు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశించినా, లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరినా దర్యాప్తు చేసేందుకు సిబిఐ సిద్దంగా ఉందని తెలిపారు. అయితే దర్యాప్తునకు అవసరమైన వసతులు, వనరులు ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలన్నారు. ఇందుకోసం అదనపు ఎస్పీ స్థాయి అధికారితోపాటు ముగ్గురు డిఎస్సీలు, ఆరుగురు సిఐలు, నలుగురు ఎస్‌ఐలతో కూడిన సిబ్బంది అవసరం ఉంటుందని వివరిస్తూ సిబిఐ హైదరాబాద్ విభాగం ప్రధానాధికారి కళ్యాణ్ చక్రవర్తి హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ అంశాన్ని ఫ్రిబ్రవరి 2న విచారణ చేస్తామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.

సిట్టింగ్ జడ్జా లేక సిబిఐనా!
కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ పథకంలో అంతర్భాగంగావుంటూ అత్యంత కీలకంగావున్న మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు.ఈ ఘటనలో కారణాలు వెలికి తీసేందకు సిట్టింగ్ జడ్జిచేత న్యాయవిచారణ జరిపిస్తామని గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలోనే ప్రకటించారు. ఈ కేసుకు ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించింది. మేడిగడ్డ అంశాన్ని సమగ్రంగా లోతుగా దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ విభాగం కూడా క్షేత్ర స్థాయిలో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించింది. త్వరలోనే మధ్యంతర నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల నాటికి విజిలెన్స్ నుంచి సమ గ్ర నివేదిక ప్రభుత్వానికి అందుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. హైకోర్టులో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్టు సిబిఐ హైకోర్టుకు తెలియజేసింది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఇటీవల మేగిగడ్డ ఘటనలో సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన మేడిగడ్డ వ్యవహారంపై సిబిఐ విచారణకైనా మరే విచారణకైనా తాము స్వాగతిస్తున్నట్టు బిఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఏవిధమైన ఆదేశాలు ఇవ్వనుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుంది.. ప్రభుత్వ వైఖరి ఎలావుంటుంది అన్నదానిపై ఆసక్తి నెలకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News