Friday, December 20, 2024

కేజ్రీవాల్‌పై తప్పుడు ప్రచారం

- Advertisement -
- Advertisement -

ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాన్ని తిరగదోడి సిబిఐ, ఇడిల పేరుతో వేధించడం ప్రజాస్వామ్య పునాదులు పతనం అవుతున్న జాడలకు చిహ్నం! ఇప్పటికే అత్యంత ప్రజాదరణ చూరగొన్న విద్యా మంత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారణ పేరుతో వేధిస్తూ నెలకుపైగా బెయిల్ రాకుండా వేధిస్తుండగా, గతంలోనే పేరు మోసిన ఆర్థిక నేరగాడు, జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖరన్‌తో ఆరోపణలు చేయించి మరో మంత్రి సత్యేంద్ర జైన్‌ను జైలులో ఉంచారు. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సిబిఐ నోటీసు ఇవ్వడం దేనికి సంకేతం? మద్యం పాలసీ అనేది మార్చుకునే అధికారం ఆప్ ప్రభుత్వానికి వున్న రాజ్యాంగ హక్కు! అదీ ప్రజలు అభిప్రాయం కోరి, కేబినెట్ తీర్మానం మేరకు కేంద్రం నియమించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం మేరకే పాలసీ అమలయ్యింది. పాలసీ మార్పును ఆసరాగా చేసుకుని దేశంలోని మద్యం వ్యాపారులు సహజంగానే తమ వ్యాపార దృక్పధంతో అడుగుపెట్టారు. అది ప్రభుత్వం సహజమైన నిర్ణయం! అయితే 2014 పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ ని నేరుగా ఢీ కొట్టిన ప్రత్యర్థి కేజ్రీవాల్.

రైతులు ఉద్యమానికి కేజ్రీవాల్ నిర్మాణాత్మక మద్దతు ఇచ్చి నిలబెట్టడం, మూడవసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ను ఎన్నుకోవడం, ప్రక్క రాష్ట్రం పంజాబ్‌లో అనూహ్య మెజారిటీతో అధికారానికి రావడం, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలలో సతమతమవడం, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో ఆప్ విస్తరించడం, చివరికు జాతీయ హోదా పొందడం వరకు ఎదిగిన ఆప్ ఎదుగుదల సహజంగానే నియంత పోకడలు సంతరించుకొంటున్న నరేంద్ర మోడీ, అమిత్ షా లకు మింగుడు పడలేదు! ఆప్ పదేళ్ళ ప్రస్థానంలో ఎక్కడా ఒక్క అవినీతి మచ్చలేదు. పైగా పైసా అప్పు లేకుండా సంక్షేమ ఫలాలు పారదర్శకంగా ప్రజలకు అందించింది.
గతంలో ముఖ్యమంత్రులను, మాజీ మంత్రులను సిబిఐ, ఇడిలను విచారణ జరిపాయి. కానీ అధికారం లో ఉండి తమ కేబినెట్ చేసిన నిర్ణయం అమలు జరిపే క్రమంలో ఆ మార్పు ఫలాలు పూర్తిగా అందకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా వచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం శాఖ మద్యం కుంభకోణం పేరుతో సిబిఐ, ఇడిలను ఉసిగొల్పి, లేని ఎలిజీలు సృష్టించి, ఇబ్బందులు పెడుతున్న తాపత్రయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలచే ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయాన్ని ఏ ప్రజలు తప్పు పట్టలేదు, పైగా ఫిర్యాదు చేయలేదు.

వ్యాపార సంస్థలు ఆరోపణలు చేయలేదు? తప్పుపట్టింది, ఫిర్యాదు చేసింది మరో పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం, అది నియమించిన గవర్నర్. ఒక ప్రభుత్వ శాఖ, నిర్ణయాన్ని మరో ప్రభుత్వ శాఖ పూర్తిగా పథకం అమలు జరిపి ఫలాలు రాక ముందే విచారించి, రాజ్యాంగ ముఖ్య పదవులలో ఉన్నవారిని కేసులు పెట్టి విచారణకు లాగిన సంఘటన ఈ దేశంలో ఇదే మొదటిది. ఒక రకంగా ఇది విశ్వాసంతో ఎన్నుకొన్న ప్రజల్ని, ప్రభుత్వాన్ని నేరుగా అనూహ్యం చేసేదిగా ఉంది. పైగా కేజ్రీవాల్ దేశ ప్రధాని స్థాయి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న దశలో బిజెపి సాగిస్తున్న ఆరోపణలు, తన రాజ్యాంగ సంస్థలను మరో పరిపాలనా ప్రభుత్వంపై ఎగదోస్తున్న విధానం వాంఛనీ యం కాదు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అనూ హ్యం చేయడమే అవుతుంది. పునాదులు బలహీన పర్చడమే అవుతుంది.ఇప్పటి ఈచర్య ప్రజలచే ఎన్నికై అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలు, వాటి నిర్ణయాలు ప్రశ్నార్థకం చేసేదిగా ఉంది? వాస్తవంగా కేజ్రీవాల్ అనే వ్యక్తి అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి, అధికారంలోనికి వచ్చిన వ్యక్తి.

గత పదేళ్ళుగా ఆయన అవినీతి మచ్చ లేకుండా ఉండి పరిపాలన చేశారు. ఆయన చేసిన ప్రతి అభివృద్ధి పథకాన్ని తప్పుపట్టి స్థానిక బిజెపి కోర్టులకు లాగింది. ఎన్ని ఆరోపణలు చేసినా కడిగిన ముత్యంలా బయట పడ్డారు. అయినా ఆయన నిరభ్యంతరంగా తన పని తాను చేస్తూ మూడు సార్లు ఢిల్లీ విశ్వాసం చూరగొన్న ముఖ్యమంత్రి! రాజకీయాలలో మంచి సాంప్రదాయా లు అంతరించిపోతున్నాయి. క్రిమినల్ ఆలోచనలు, చర్యల వైపు ఆలోచనలు దిగజారిపోయింది రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో మార్పు కోరుకునే వారి పరిస్థితి కేజ్రీవాల్‌లానే ఉంటుందని తాజా పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. కేజ్రీవాల్‌కు సిబిఐకి నోటీసు లిచ్చి విచారణకు పిలిచి ఆయన చరిస్మాను తగ్గించాలని సంకలు గుద్దుకుంటుంటే గుద్దుకొనవచ్చును. కానీ, కేజ్రీవాల్ నేడు దేశంలో కోట్లాది ప్రజల మనస్సులను చూరగొన్న ఆదర్శ ముఖ్యమంత్రి! కేజ్రీవాల్ పట్ల, ఆయన మంత్రివర్గ సహచరులు పట్ల అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కనుక కేజ్రీవాల్ ఇలాంటి చీఫ్ ఎత్తుగడలకు భయపడే వ్యక్తి కాదు.

దేశంలో కార్పొరేట్ శక్తుల అధికారాన్ని కూల్చి సామాన్యుడి పరిపాలన ఆయన కల! ఆ కల నేరవేర్చడం కోసమే ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. 2012 నవంబర్ 26న ఒక్క ప్రజా ప్రతినిధి లేకుండా ఆమ్‌ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ తనదైన రాజకీయ శైలిలో ఎదిగారు. పదేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా 166 మంది శాసన సభ్యులు, పది మంది పార్లమెంటు సభ్యులు, మూడు పట్టణాల్లో మేయర్లు, 15000 మంది చిన్నచితక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా ఆప్ ఎదిగింది. నేడు దేశంలో ఉన్న ఆరు జాతీయ పార్టీలలో ఆప్ ఉంది. ఈ ప్రస్థానంలో కేజ్రీవాల్ కేవలం మాటలతో, వాగ్దానాలుతో సాధించలేదు? పరిపాలనా ఆదర్శాలు, అనుభవాలతో కలగలిసిన నమ్మకం కేజ్రీవాల్. ఢిల్లీలో తమ ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి తేలడంతో పాటు, పంజాబ్‌లో సైతం సామాన్యుడి పరిపాలనకు మార్గం సుగమం చేశారు. గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌లనే కాదు దేశమంతా చాలా వేగంగా విస్తరిస్తున్న కేజ్రీవాల్ చరిస్మాను ప్రత్యర్థులు పెట్టే చిక్కుముడి విప్పుకోగలిగిన నైపుణ్యం కేజ్రీవాల్‌కు వుంది. దేశం అభివృద్ధి ని, ప్రగతిని కాంక్షించే ప్రతిపక్ష ముఖ్యమంత్రులను వేధించాలనే సరికొత్త రాజకీయ తంత్రం ప్రజాస్వామ్య వ్యతిరేక భావజాలం కలిగినదని పాలకులు గుర్తించాలి. ఇట్లాంటి చర్యలు ఒక్కోసారి బెడిసి కొట్టి ప్రజల ఆగ్రహాన్ని అధికార పక్షం చవిచూసే అవకాశం ఉంది.

కేవలం విచారణ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. అంతిమంగా అన్నం లేకపోయినా భరిస్తారు కానీ ప్రజాస్వామ్య ప్రతీకారాన్ని సహించమని దేశ ప్రజలు గతంలో నిరూపించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కిచ్చిన సిబిఐ నోటీసులు ఉపసంహరణ చేసుకోవాలని ప్రజలు కోరిక. లక్షలాది కోట్లు కుంభకోణాలు నుంచి తన అనుచరులను రక్షించుకునేందుకు వందకోట్ల కుంభకోణం పేరుతో ఒక్కపైసా ఆదాయం లేకుండా ఎన్నికైన ప్రభుత్వంను ఏకంగా వేధింపులకు గురిచేయడం, ప్రచారంలో దిగజారడం సరికొత్త ఎత్తుగడల శకం భారత రాజకీయాల్లో కనిపిస్తుంది. స్వచ్ఛమైన మనస్సుతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ తన స్వచ్ఛతను నిరూపించుకొని మరింత బలోపేతం అవ్వాలని ఆశిద్దాం!

యన్ తిర్మల్
7207864514

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News