ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీపై తరచూ ఒంటికాలిపై లేచే ప్రధాని మోడీ పాలన అంతా అప్రకటిత ఎమెర్జెన్సీయేనని ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు రుజువైంది. తన నిర్ణయాలకు ఎదురు చెప్పేవారినందరినీ ఇడి, సిబిఐ, ఐటి దాడులకు గురి చేసి కటకటాల్లో తోయడమే మోడీయిజమని ఎటువంటి అనుమానానికి సందులేని రీతిలో వెల్లడైపోయింది. ధిక్కారముల్ సైతునా అంటూ ఆయన వేస్తున్న చిందుల్లో ప్రజాస్వామ్యాన్ని కసిగా ఉరి తీస్తున్న దృశ్యమే కళ్ళకు కడుతున్నదని అనడం అసత్యం కాబోదు. ప్రధాని మోడీ ప్రభుత్వం తన చేతిలోని ఆదాయ పన్ను (ఐటి) శాఖను పట్టపగలు ఇంత పచ్చిగా దుర్వినియోగం చేయబోదని ఎవరూ, ఎప్పుడూ అనుకొని వుండరు.
అయితే అంతర్జాతీయంగా ఎదురయ్యే అప్రతిష్ఠకు కూడా వెరవకుండా దేశంలోని బిబిసి (బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) కార్యాలయాల మీద ఐటి దాడులు జరిపించిన తీరు ఆశ్చర్యం కలిగించడం సహజం. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002 నాటి అమానుషకాండను ఆపడంలో నరేంద్ర మోడీ విఫలమయ్యాడన్న ఆరోపణలను తిరిగి తెర మీదికి తెస్తూ ‘ఇండియా: మోడీ కొశ్చన్’ అనే శీర్షికతో బిబిసి విడుదల చేసిన డాక్యుమెంటరీని దేశంలో ప్రసారం చేయనీయకుండా యూ ట్యూబ్‌ను, ట్విట్టర్‌ను శాసించి నిరోధించిన ఘట్టం చోటు చేసుకొని నెల రోజులైనా తిరగలేదు. ఇంతలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. బిబిసి డాక్యుమెంటరీ పాలక దిగ్గజాల్లో ఎంతటి వణుకు పుట్టించిందో దీని ద్వారా తెలుస్తున్నది. మోడీ స్వయంగా కాళ్ళరిగేలా విస్తృత ప్రచారం చేసి గుజరాత్‌లో బిజెపిని వరుసగా ఏడోసారి గెలిపించుకొన్న తర్వాత ఆయనకిక ఎదురులేదనుకొన్నారు. కాని లోక్‌సభ ఎన్నికలు చేరువవుతున్న సమయంలో దెబ్బ మీద దెబ్బగా బిబిసి డాక్యుమెంటరీ, అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం విరుచుకుపడి కేంద్రంలోని బిజెపి పాలననే కాకుండా, వ్యక్తిగతంగా మోడీ పరువును పది నిలువుల లోతున పాతిపెట్టడం మామూలు విషయం కాదు.
ఒకవైపు అప్రమేయంగా వచ్చి పడిన జి20 సారథ్యాన్ని చూపి గొప్పగా చెప్పుకొంటూనే, మరోవైపు అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు కలిగిన మీడియా సంస్థ బిబిసిని ఐటి దాడులతో బెదిరించే చర్యకు పూనుకోడం ప్రపంచ సమాజం ముందు మోడీ ప్రభుత్వాన్ని దోషిగానే నిలబెడుతుంది గాని, దానికి ఏమాత్రం ఖ్యాతిని కట్టబెట్టబోదు. బిబిసి డాక్యుమెంటరీని తొలగింపజేయడాన్ని అమెరికా కూడా తీవ్రంగా తప్పుబట్టింది. బాహాటంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు తాము మద్దతు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ప్రెస్ పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ, మతావలంబన స్వాతంత్య్రం మానవ హక్కుల మాదిరిగానే ప్రజాస్వామ్యం పటిష్టం కావడానికి దోహదం చేస్తాయన్నారు. ఇండియాలోనూ తమ వైఖరి ఇదేనని చెప్పారు. దానితో లెంపలు వేసుకోడానికి బదులు మన కేంద్ర పాలకులు బిబిసిపై ఇంతగా పేట్రేగిపోడాన్ని ఏమనుకోవాలి? ఇది కేవలం అంతర్జాతీయ మీడియానే కాకుండా దేశంలోని పత్రికలను, చానళను, యూట్యూబ్ మాధ్యమాన్ని కూడా బెదిరించడంగానే భావించాలి. 2002లో గుజరాత్‌లోని ఉన్మాదులు ముస్లిం కుటుంబాలపై హింసకు తెగబడినప్పుడు 1000 నుంచి 2000 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీ తనకేమీ పట్టనట్టు ఊరుకోబట్టే ఆ దారుణ మారణకాండ బాహాటంగానే అనుకొన్నారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ గుజరాత్‌లో మాట్లాడుతూ మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మోడీపై అభియోగాన్ని నిర్ధారించలేకపోడంతో ఆయనకు క్లీన్‌చిట్ లభించింది.
అంతటితో సమసిపోయిందనుకొన్న వ్యవహారం బిబిసి డాక్యుమెంటరీ రూపంలో ఈ విధంగా తిరిగి వెన్నాడడం ఆయనను బోనులో నిలబెట్టింది. దీనితో బిబిసిని దేశంలో నిషేధించాలన్న డిమాండ్‌ను కూడా హిందుత్వ శక్తులు ముందుకు తీసుకొచ్చాయి. కాని అందుకు సుప్రీంకోర్టు నిరాకరించి మంచి పనిచేసింది. దేశీయ మీడియా సంస్థల నోరు మూయించడానికి కూడా ఐటి దాడులను ప్రయోగించిన సందర్భాలు గతంలో లేకపోలేదు. కరోనాను గొప్పగా ఎదుర్కొన్నానని కేంద్ర ప్రభుత్వం డబ్బా వాయించుకోడాన్ని ఎండగడుతూ గంగా నదిలో శవాలు తేలియాడిన దృశ్యాలను, సామూహిక శవ దహనాల చిత్రాలను ప్రచురించినందుకు దైనిక్ భాస్కర్ పత్రిక కార్యాలయాలపై 2021లో ఐటి దాడులను జరిపించారు. అలాగే ఎన్‌డి టివి, న్యూస్ క్లిక్‌లపై కూడా ఈ దాడులు జరిగాయి. పత్రికా స్వేచ్ఛ విషయంలో ఇండియా మొత్తం 180 దేశాల్లో అత్యధమంగా 150వ స్థానంలో వుండడం మన అప్రకటిత ఎమెర్జెన్సీని ప్రపంచ నడి బజారులో వుంచుతున్నది.