న్యూఢిల్లీ: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజిఈ) ఉత్తీర్ణులు కాకుండానే స్టేట్ మెడికల్ కౌన్సిల్స్(ఎస్‌ఎంసిస్) లేక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ)లో తమకు తామే నమోదుచేసుకున్న విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లపై సిబిఐ దర్యాప్తు మొదలెట్టింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తు చేపట్టింది. 2011 నుంచి 2022 వరకు రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి వివిధ దేశాలలో వైద్య విద్యను అభ్యసించిన 73 మంది అభ్యర్థులు అలాంటివారే.
క్రిమినల్ కాన్సిపరసీ, మోసం, ఫోర్జరీ వంటి వాటికి సంబంధించిన ఐపిసి సెక్షన్ల కింద వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది.
ఇప్పుడున్న నియమాల ప్రకారం విదేశాల్లో ఎవరైనా వైద్య విద్యను అభ్యసించితే, వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజిఈ) అనే స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణతనొందాల్సి ఉంటుంది. అప్పుడే వారు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసి) లేక రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్(ఎస్‌ఎంసి)లలో నమోదుచేసుకుని భారత్‌లో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి వీలుంటుంది. వీదేశాల్లో వైద్య విద్య కోర్సు పూర్తి చేసుకుని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉత్తీర్ణత పొందని వారు 73 వరకు ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ ఇటీవల సిబిఐకు ఫిర్యాదు చేశారు. క్వాలిఫై కాకుండానే వారెలా భారత్‌లో నమోదుచేసుకున్నారన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. విదేశాల్లో వైద్య విద్య చదివిన వారికి స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించే బాధ్యత ‘ద నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బిఈఎంఎస్)కు అప్పగించారు.