Monday, November 18, 2024

ఫామ్ హౌస్ కేసులో రేపోమాపో సిబిఐ విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) ఎంఎల్‌ఏల ఎర కేసులో కేంద్ర నేర పరిశోధన సంస్థ(సిబిఐ) ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ఆరంభించనుంది. ఎంఎల్‌ఏ ఎర కేసును తెలంగాణ హైకోర్టు ఇటీవల సిబిఐకి అప్పగించింది. హైకోర్టు తీర్పు తర్వాత సిబిఐ ఉన్నతాధికారులు ఫాలోఅప్ చర్యలు చేపట్టనున్నారు. సిబిఐ దర్యాప్తు చేపట్టేందుకు ఇన్వెస్టింగ్ ఆఫీసర్‌ను నియమించనున్నది. ఎంఎల్‌ఏల ఎర కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పు అనుసారం సిబిఐ మొదట ప్రథమ సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్)ను నమోదుచేయనుంది. ఆ తర్వాతే దర్యాప్తును మొదలెట్టనున్నది.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కింద ఉన్న మోయినాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్(455/2022) ఆధారంగానే సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఉండనుంది. నిందితులను మోయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారన్నది తెలిసిందే. భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) నలుగురు ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం, బిజెపికి అనుకూలంగా మారేందుకు వారిని ఆకర్షించడం వంటి పనులకు ఆ ముగ్గురు నిందితులు పాల్పడ్డారన్నది ఆరోపణ. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ అనే ఆ ముగ్గురు నిందితులు మోయినాబాద్ ఫారమ్ హౌస్‌లో ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టే, బిజెపి పార్టీలోకి ఆకర్షించే మంతనాలు జరిపారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురు ఎంఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చేలా వారు ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ముగ్గురు బిజెపి ఏజెంట్లని ఆరోపణ.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)ను నవంబర్ 9న ఏర్పాటుచేసింది. ఆ సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే హైకోర్టు కేసును సిబిఐకి బదలాయించేసింది. సిట్ తన దర్యాప్తులో భాగంగా బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్. సంతోష్‌కు సమ్మన్‌లు జారీ చేసింది. కానీ అతడు హైకోర్టు నుంచి స్టే పొందాడు. ఆ తర్వాత డిసెంబర్ 1న నిందితులు హైకోర్టు నుంచి బెయిల్ కూడా సంపాదించుకున్నారు. ఇతర కేసుల కింద రామచంద్ర భారతి, నంద కుమార్‌లను మళ్లీ అరెస్టు చేశారు. కాగా తెలంగాణ హైకోర్టు కేసును డిసెంబర్ 26న సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేసేసింది. అంతేకాక సిట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును కూడా కొట్టేసింది. కాగా సింగిల్ బెంచ్ ఉత్తర్వును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభత్వుం అప్పీల్ దాఖలు చేస్తుందా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. ఒకవేళ సిబిఐ కేసును నమోదు చేస్తే, దర్యాప్తు మళ్లీ కొత్తగా మొదలవుతుంది. సిటి ఇంతవరకు చేపట్టిన దర్యాప్తును హైకోర్టు ప్రక్కన పెట్టేసింది. సిబిఐ విచారణ ఎలా మొదలవుతుందన్నది ఆసక్తి దాయకంగా మారింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను ప్రశ్నించేందుకు మొదట పిలుస్తుందని భావిస్తున్నారు. నిందితులను కూడా విచారణకు రమ్మని పిలవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News