పాట్నా: నీట్ యుజి ప్రశ్నాపత్రం లీక్ కేసులో సిబిఐ తొలి అరెస్టులు జరిపింది. బీహార్‌లోని పాట్నాలో ఇద్దరు వ్యక్తులను సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. మే 5న నీట్ యుజి పరీక్ష జరుగగా ముందు రోజు అభ్యర్థులకు ఒక సురక్షిత స్థావరాన్ని సమకూర్చి లీకైన ప్రశ్నాపత్రాలను, ఆన్సర్ కీస్‌ను అందచేసిన మనీష్ కుమార్, అశుతోష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను సిబిఐ బృందం అరెస్టు చేసినట్లు అధికారులు వివరించారు.
నీట్ పేపర్ లీక్ కేసులో ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సిబిఐ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశం కోసం నీట్ యుజి పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) నిర్వహించింది.
ఈ ఏడాది నీట్ పరీక్షను మే 5న 14 విదేశీ నగరాలతోసహా దేశవ్యాప్తంగా 571 నగరాలలోని 4,750 సెంటర్లలో ఎన్‌టిఎ నిర్వహించింది. 23 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు గత శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా మరుసటి రోజు ఆదివారం నాడు తొలి సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నీట్ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులలో కొంతమంది చేసిన డిమాండు మేరకు సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.