మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్
బిజెపి బెదిరింపులకు భయపడమన్న టిఎంసి ఎంపి
న్యూఢిల్లీ/కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సిబిఐ నోటీస్ జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ దర్యాప్తునకు హాజరు కావాలని పేర్కొన్నది. కోల్‌కతాలోని రుజిరా నివాసంలోనే ఆమెను ప్రశ్నించనున్నట్టు తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ అధికారుల ముందు హాజరు కావాలని ఈ నోటీస్‌లో పేర్కొన్నారు. ఇదే కేసులో శుక్రవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్టు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్డ్‌ఫీల్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్లు అమిత్‌కుమార్‌ధర్, జయేశ్‌చంద్రరాయ్, ఇసిఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్‌దాస్, తదితరులపై గతేడాది నవంబర్‌లోనే సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బెంగాల్‌లోని కునుస్టోరియా, కజోరా ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో అక్రమంగా బొగ్గు తోడేసినట్టు వీరిపై ఆరోపణలున్నాయి.
ఏప్రిల్‌మే నెలల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మమత కుటుంబసభ్యులకు నోటీస్ జారీ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. సిబిఐ నోటీసులతో తమ పార్టీ బిజెపికి తలవంచబోదని టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడ్తామని వారనుకుంటే అది పొరపాటేనని ఆయన అన్నారు. తాము ఒంటరివాళ్లం కాదని ఆయన అన్నారు. దేశ చట్టాల పట్ల తమకు పూర్తి అవగాహన ఉన్నదన్నారు.
CBI notice to wife of Mamata’s nephew Abhishek Banerjee