Sunday, December 22, 2024

సిబిఐ వలలో రైల్వే అధికారి: లంచం పుచ్చుకుంటూ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లంచం పుచ్చుకుంటూ అరెస్టయిన ఒక రైల్వే అధికారి నివాసం నుంచి రూ. 2.61 కోట్ల నగదును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం అధికారులు తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్‌ఓనలి గోరఖ్‌పూర్‌లో ఈశాన్య రైల్వేలో ప్రిన్సిపాల్ చీఫ్ మెటీరియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కెసి జోషిని ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 3 లక్షల లంచం పుచ్చుకుంటుండగా మంగళవారం సాయంత్రం సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.

తన సంస్థ ఈశాన్య రైల్వేలకు కొన్ని వస్తువులను, సర్వీసులను అందచేస్తుందని, కాంట్రాక్టు పద్ధతిలో మూడు ట్రక్లు వస్తువులను సరఫరా చేసేందుకు తనకు రైల్వేల నుంచి కాంట్రాక్టు లభించిందని సదరు కాంట్రాక్టర్ సిబిఐ అధికారులకు తెలిపాడు. ఇందుకు గాను తనకు ఒక్కో ట్రక్కుకు నెలకు రూ. 80,000 ఆదాయం లభిస్తుందని కాంట్రాక్టర్ తెలిపాడు. అయితే జోషి తనను రూ. 7 లక్షలు లంచం చెల్లించాలని డిమాండు చేస్తున్నారని, లంచం ఇవ్వనిపక్షంలో ప్రభుత్వ ఇమార్కెట్‌ప్లేస్ వెబ్‌సైట్ నుంచి తన సంస్థ రిజిస్ట్రేషన్‌ను తొలగించడమేగాకుండా కాంట్రాక్టును రద్దు చేయిస్తానని ఆయన బెదిరించినట్లు కాంట్రాక్టర్ సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారించుకున్న సిబిఐ అధికారులు లంచంలో కొంత మొత్తాన్ని ఇచ్చి ఆ అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని వలపన్నారు. రూ. 3 లక్షలు పుచ్చుకుంటుండగా జోషిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలో తనికీలు నిర్వహించిన అధికారులు రూ. 2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News