గత ఏడాది ఎయిమ్స్ ఆత్మహత్యగా నివేదికలో వెల్లడించినా….
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు 34 ఏళ్ల సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించిన ఇవాళ్టికి సంవత్సరం పూర్తయింది. 2020 జూన్ 14న ముంబై లోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై పోలీసులతోపాటు బీహార్ పోలీస్, సిబిఐ , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇడి దర్యాప్తు చేస్తున్నా ఈ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఇది ఆత్మహత్యేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు వెల్లడించినప్పటికీ సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ! మాత్రం ఈకేసు దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని సోమవారం ప్రకటించింది. బీహార్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు మొదట చేపట్టగా వారి నుంచి సిబిఐ దర్యాప్తు స్వీకరించింది. పాట్నాలో ఉంటున్న సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ఆతహత్యకు ప్రేరేపణ జరిగినట్టు బీహార్ పోలీసులు కేసును నమోదు చేశారు. దీనిపై సిట్ ఏర్పాటైనా వాంగ్మూలాల నమోదు, ఫోరెన్సిక్ నివేదికల సేకరణ తప్ప కేసు దర్యాప్తు ముందుకు వెళ్లలేదు.
సుశాంత్‌కు విషమిచ్చి హత్య చేశారని, ఉరికి వేలాడ దీశారన్న వాదనలను ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం కొట్టివేయడంతో సిబిఐ అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ నివేదిక వెలువడగానే రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్ తరఫున న్యాయవాది వికాస్ సింగ్ ఈ నివేదిక తమను తీవ్రంగా కలచి వేసిందని ఆందోళన వెలిబుచ్చారు. తాజాగా ఫోరెన్సిక్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సిబిఐని అభ్యర్థించారు. మృతదేహం లేకుండా పోస్టుమార్టమ్ సరిగ్గా జరగకుండా ఎప్పుడు మరణించారో సమయం వివరించకుండా ఎలా తుది నివేదిక ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే న్యాయవాది వికాస్ సింగ్ అభిప్రాయాన్ని సిబిఐ పరిగణన లోకి తీసుకోలేదు. సుశాంత్ సింగ్ తండ్రి ఈ కేసు దర్యాప్తు తీరుపై అసంతృప్తి వెలిబుచ్చారు. సిబిఐ దర్యాప్తు వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం ఊహాగానాలపై సాగుతోందని మీడియా కథనాలు కూడా ఆరోపించాయి. ప్రస్తుతం దర్యాప్తు ఎలా సాగుతోందో సిబిఐ తెలియచేయడం లేదు. విధానపరమైన నిర్ణయం ప్రకారం వివరాలు వెల్లడించకూడదని సమర్థిస్తోంది.