మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వామన్‌రావు తండ్రికి ఎంత బాధ ఉందో కోర్టుకు అంతే ఉందని తెలిపింది. దర్యాప్తు ఇప్పటివరకు సరైన దిశలోనే సాగుతోందని.. ఇప్పుడు సిబిఐకి అప్పగిస్తే సమయం వృథానేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. వామన్‌రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై కోర్టుకు ఏజీ నివేదిక సమర్పించారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 25 మంది సాక్షులను విచారించినట్లు వెల్లడించారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామని నివేదికలో వివరించారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలతో పాటు.. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణీకుల వాంగ్మూలాలను న్యాయస్థానం ముందు ఉంచామన్న పోలీసులు.. సిసిటీవీ, చరవాణి దృశ్యాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఘటన సమయంలో బస్సుల్లో ఉన్న సాక్షులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపిన పోలీసులు వారికి అవసరమైన భద్రతను కల్పించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
CBI Probe not required in Lawyer Couple murder: HC