ఇది ఎల్‌డిఎఫ్‌కే ఎదురు దెబ్బ : ఓమెన్ చాందీ వ్యాఖ్య
తిరువనంతపురం : తనపైన, మరో నలుగురు కాంగ్రెస్ నాయకుల పైన దాఖలైన లైంగిక వేధింపుల కేసులో సిబిఐ దర్యాప్తునకు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించడం అది ఎల్‌డిఎఫ్‌కే ఎదురు దెబ్బ అవుతుందని మాజీ ముఖ్యమంత్రి ఓమెన్ చాందీ వ్యాఖ్యానించారు. ఈ దర్యాప్తునకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పినరయి విజయన్ ప్రభుత్వం శనివారం అకస్మాత్తుగా సిబిఐ దర్యాప్తునకు నిర్ణయం తీసుకుంది. 2013 లో సోలార్ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన ఓమెన్ చాందీ పైన, ఎంపిలు కెసి వేణుగోపాల్, హిబి ఎడెన్, ఆదూర్ ప్రకాష్, మాజీ మంత్రి , ఎమ్‌ఎల్‌ఎ ఎపి అబ్దుల్లా కుట్టిలపై మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కూడా కేసు దాఖలైంది. ఎఫ్‌ఐఆర్ దాఖలైన తరువాత తమలో ఎవరం కోర్టుకు వెళ్లలేదని, ఇప్పటికి ఐదేళ్లు గడిచాయని, వాళ్లేమీ చేయలేక పోయారని, ముగ్గురు డిజిపిలు కేసు దర్యాప్తు చేపట్టినా ఏదీ కనిపించలేదని, చాందీ వ్యాఖ్యానించారు.