Tuesday, July 2, 2024

గుజరాత్‌లో 7 చోట్ల సిబిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యుజి 2024 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గుజరాత్‌లోని ఏడు ప్రదేశాలలో సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోధ్రా జిల్లాలలో విస్తరించి ఉన్న అనుమానితులకు చెందిన ప్రాంగణాలలో శనివారం ఉదయం సోదాలు ప్రారంభమయ్యాయని వారు చెప్పారు. నీట్ పేపర్ లీకేజీ కేసుతో సంబంధం ఉన్న జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఒక పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తోపాటు ఒక హిందీ వార్తాపత్రిక జర్నలిస్టును శుక్రవారం సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) నిర్వహించిన నీట్ పరీక్ష కోసం ఒయాసిస్ స్కూలు ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్‌ను హజారీబాగ్ నగర సమన్వయకర్తగా నియమించారని వారు వివరించారు.

వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఇస్లాంను ఒయాసిస్ స్కూలుకు ఎన్‌టిఎ పరిశీలకుడిగా నియమించారని అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి జిల్లాకు చెందిన మరో ఐదుగురు వ్యక్తులను కూడా సిబిఐ ప్రశ్నిస్తున్నట్లు వారు చెప్పారు. ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్‌కు సహాయపడేందుకు ప్రయత్నించిన జర్నలిస్టు జమాలుద్దీన్ అన్సారీని అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సిబిఐ నమోదు చేసింది. వాటిలో ఒకటి కేంద్ర విద్యా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా మిగిలిన ఐదు ఎఫ్‌ఐఆర్‌లు వివిధ రాష్ట్రాలలో తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నమోదు చేసినవని అధికారులు తెలిపారు. బీహార్, గుజరాత్‌లో ఒక్కో కేసు చేపట్టగా రాజస్థాన్‌లో మూడు కేసులను సిబిఐ దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News