న్యూఢిల్లీ : నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు సిబిఐ రట్టు చేసింది. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. సిక్కిం, పశ్చిమబెంగాల్‌లలో నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో సిబిఐ అధికారులు ఆయా రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో పిఎస్‌ఎల్‌కే సీనియర్ సూపరింటెండెంట్‌తోపాటు ఓ మధ్యవర్తి కూడా పట్టుబడ్డారని పోలీస్‌లు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ అధికారులు , ప్రైవేట్ వ్యక్తులతో సహా 24 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో 16 మంది అధికారులతో సహా 24 మంది పేర్లు ఉన్నాయి. వారు లంచాలకు బదులుగా అనర్హులకు , నాన్ రెసిడెంట్‌లకు నకిలీ పత్రాల ఆధారంగా పాస్‌పోర్ట్‌లు జారీ చేశారని పోలీస్‌లు వెల్లడించారు. ఈ సోదాలు కోల్‌కతా, సిలిగురి, గ్యాంగ్‌టక్ తదితర ప్రాంతాల్లో జరిగినట్టు తెలుస్తోంది.