న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇంతవరకు తొమ్మిది కేసులను నమోదు చేసింది. సిబిఐకి చెందిన నాలుగు ప్రత్యేక బృందాలు కోల్‌కతా లోని హింస జరిగిన ప్రాంతాలలో దర్యాప్తును ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా మరికొన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం సిబిఐ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత మే 2 న జరిగిన హింసాత్మక సంఘటనలపై మానవ హక్కుల కమిషన్ నివేదిక సమర్పించడంతో కోల్‌కతా హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించారు. ఈ కేసులపై దర్యాప్తు బాధ్యతను సిట్ బృందానికి కూడా హైకోర్టు అప్పగించింది. సిబిఐ, సిట్ దర్యాప్తులను హైకోర్టు పర్యవేక్షిస్తుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఆరు వారాల్లో తమ నివేదికలను హైకోర్టుకు సమర్పించ వలసి ఉంటుంది.